కమ్యూనిస్టు దిగ్గజం ఏఐ వీడియో
ప్రచారంలో వాడుతున్న సీపీఎం
లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి పారీ్టలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రచారం పర్వంలో కృత్రిమ మేధ (ఏఐ)తో ఇప్పటికే జోరుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పశి్చబెంగాల్‌లో సీపీఎం కూడా ఇదే దారి పట్టింది. కొద్ది రోజుల క్రితం ఏఐ యాంకర్ ‘సమత’ను ప్రచారంలోకి దింపిన ఆ పార్టీ, తాజాగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య వీడియోను కూడా అలాగే తయారు చేసింది!
ఏఐ సహాయంతో సరిగ్గా మాజీ బుద్ధదేవ్ ప్రతిరూపాన్ని, వాయిస్‌ను రూపొందించింది. 2 నిమిషాల 6 సెకన్ల నిడివితో కూడిన వీడియో సందేశం సాయంతో అటు బీజేపీ, ఇటు తృణమూల్‌పై ఏకకాలంలో దాడి చేసింది. ‘‘బెంగాల్లో ఉపాధి లేదు, మహిళలకు గౌరవం లేదు. రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పరిశ్రమలొస్తాయని, వ్యవసాయం మెరుగుపడుతుందని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని తృణమూల్ చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అంతా అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది.
కేంద్రంలో బీజేపీ కూడా జనాల జీవితాలతో ఆడుకుంటోంది. నోట్ల రద్దు నుంచి మొదలుకుని కార్పొరేట్ లూటీ దాకా సర్వం కొద్ది మంది కుబేరులకు మేలు చేసే నిర్ణయాలే. తాజాగా మోదీ సర్కారు ఎన్నికల బాండ్ల అవినీతికి పాల్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దేశాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే పనిలో పడింది. ఈ ఆటలను సాగనీయొద్దు. అందుకు మన ముందున్న మార్గం పోరాటం ఒక్కటే. ఈ పోరాటంలో గెలవాలంటే ఈ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ సెక్యులర్ అభ్యర్థులనే గెలిపించండి’’ అంటూ వీడియోలో బుద్ధదేవ్ విజ్ఞప్తి చేశారు!
ఇంటికే పరిమితం...
తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బుద్ధదేవ్ కొంతకాలం కిందట ఆస్పత్రిలో చేరారు. కోలుకుని ఇంటికి తిరిగొచి్చన తర్వాత బయటికి కనిపించడమే లేదు. పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి సీపీఎం ఇలా బుద్ధదేవ్‌తో కూడిన ఏఐ వీడియోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీడియోను రూపొందించిన తరువాత బుద్ధదేవ్ కుటుంబానికి వినిపించి, వారి అనుమతితోనే సామాజిక వేదికల్లో పోస్ట్ చేసింది పార్టీ. బుద్ధదేవ్ సందేశం వామపక్ష కార్యకర్తలకు ఎంతో ఉత్తేజాన్నిస్తుందని సీపీఎం నమ్ముతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఓటర్లను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుందని భావిస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment