న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అమలవుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ భేటీలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ఎన్‌ఎస్‌ఏ (జాతీయ భద్రతా సలహాదారు) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) డైరెక్టర్ అర్వింద్ కుమార్, రా (రీసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్ సామంత్ కుమార్ గోయెల్, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా అన్నారు.
కశ్మీర్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ 76% వరకు పూర్తి చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఆయన అభినందనలు తెలిపారు. కశ్మీర్‌లోని నాలుగు జిల్లాల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. పీఎం కిసాన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు తదితర పథకాల ప్రయోజనాలను కశ్మీర్ ప్రాంత రైతులకు అందేలా చూడాలని అమిత్ షా కోరారు. పారిశ్రామిక విధానం ప్రయోజనాలను చిన్న తరహా పరిశ్రమలు అందుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా ఎన్నికైన పంచాయతీ సభ్యులకు శిక్షణ అందించాలనీ, దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన పంచాయతీల్లో వారు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment