సాక్షి, ముంబై: వినూత్న ఆలోచనలు, స్ఫూర్తిదాయకమైన కథనాలు, వైవిధ్యమైన పనుల గురించి తెలియాలంటే ప్రముఖ వ్యాపారావేత్త ఆనంద్ మహీంద్ర ట్విటర్‌ని ఫాలో అయితే సరిపోతుంది. ఆసక్తిదాయకమైన వీడియోలకు ఆయన ట్విటర్ అకౌంట్ గోల్డ్‌మైన్‌లా మారింది. ఆలోచనాత్మక పోస్ట్‌లతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్ మహీంద్రాకు ఇష్టం. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఆనంద్ మహీంద్ర తన ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. గంటలోపే ఈ వీడియోని 36 వేల మంది వీక్షించగా.. 3000 మంది లైక్ చేశారు. ఎప్పటిలానే ఓ అద్భుతమైన పనిమంతుడి వీడియోని షేర్ చేశారు ఆనంద్ మహీంద్ర.
57 సెకన్ల నిడివిగల ఈ వీడియోని ఓ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న ప్రదేశంలో తీశారు. ఇక్కడ దినసరి కూలీ అయిన ఓ యువకుడు తన తల మీద ఏకంగా 32 ఇటుకలను పేర్చుతాడు. అడ్డం, నిలువు బ్యాలెన్స్ చేసుకుని.. ఎవరి సాయం లేకుండా.. ఒక్కడే తల మీద 32 ఇటుకలను నిలబెట్టాడు. అతడి ప్రతిభకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర ‘‘ఎవరూ ఇంత కష్టమైన పని చేయాలనుకోరు. కానీ తన కష్టాన్ని అందమైన కళగా మార్చుకున్న ఈ వ్యక్తిని తప్పక అభినందించి తీరాలి. ఇతను ఎక్కడ పని చేస్తున్నాడో మీలో ఎవరికైనా తెలుసా.. అతని యజమానులు ఆటోమేషన్‌ను అందించగలరా.. అతని ఉన్నత-స్థాయి నైపుణ్యాలను కూడా గుర్తించగలరా’’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఈ వీడియోపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘భద్రత ముఖ్యమే మేం కూడా అగీకరిస్తాం.. కానీ ఇక్కడ ఆటోమేషన్‌ను ప్రవేశపెడితే.. పాపం అతడికి ఈ పని కూడా దూరమవుతుంది.. కుటుంబం ఆకలితో అలమటిస్తుంది’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment