18 రోజులు.. 12వేల కిలోమీటర్ల బైక్‌ ప్రయాణం | Army Group Bike Rally 18 Days 12 Thousand Kilometers | Sakshi
Sakshi News home page

18 రోజులు.. 12వేల కిలోమీటర్ల బైక్‌ ప్రయాణం

Published Sun, May 1 2022 10:20 PM | Last Updated on Sun, May 1 2022 10:20 PM

Army Group Bike Rally 18 Days 12 Thousand Kilometers - Sakshi

మందస: కొండలు దాటారు.. కోనలు దాటారు.. లోయలు చూశారు.. శిఖరాల పక్క నుంచి ప్రయాణించారు... ‘ఏడుగురు అక్కచెల్లెళ్లు’ను పలకరించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. ఒకటా రెండా.. పన్నెండు రాష్ట్రాలు.. పన్నెండు వేల కిలోమీటర్ల దూరా న్ని 18 రోజుల్లో పూర్తి చేశారు. సైని కులు తలపెట్టిన బృహత్తర సాహస యాత్ర ఇది. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా కోవిడ్, వైద్యంపై అవగాహన కల్పించడానికి 12 మంది సోల్జర్ల బృందం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట బైక్‌ ర్యాలీ నిర్వహించా రు. ఈ బృందంలో ఓ సిక్కోలు సైనికుడు కూడా ఉన్నాడు. మందస గ్రామానికి చెందిన డుంకురు సతీష్‌కుమార్‌ ఈ సాహస బృందంలో ఓ సభ్యుడు. ఈయన నాయక్‌ క్యాడర్‌లో పనిచేస్తున్నారు. 

సెవెన్‌ సిస్టర్స్‌గా ముద్దుగా పిలిచే ఈశాన్య రా ష్ట్రాలో బైక్‌ రైడింగ్‌ అంత ఈజీ కాదు. సులభమైన పనులు చేస్తే వారు సైనికులు ఎందుకవుతారు. అందుకే ఈ 12 మంది బృందం ఈ రాష్ట్రాల మీదుగా బైక్‌లతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది. కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ రాజేశ్‌ అడావ్‌ ఆధ్వర్యంలో నలుగురు డాక్టర్లు, నలుగురు ఆర్మీ అధికారులు, నాయక్‌ కేడర్‌ కలిగిన ఇద్దరు సైనికులు, హవల్దార్‌ కేడరు ఇద్దరు మొత్తం 12 మందితో కూడిన బృందం న్యూఢిల్లీలోని నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ నుంచి ఈ నెల 9న బయలుదేరింది. ఉత్తరప్రదేశ్, బీహార్, అసోం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరాంఛల్‌ రాష్ట్రాల మీదుగా 18 రోజుల పాటు 12వేల కిలో మీటర్లు మోటారు వాహనాలతో సాహస యాత్ర సాగింది. దారిలో 78 ఆర్మీ మెడి కల్‌ యూనిట్లలో ఈ బృందం అవగాహన కల్పించింది. యాత్ర ఈ నెల 27తో ముగియగా, ఆర్మీ ఉన్నతాధికారులు ఈ బృందాన్ని అభినందించారు. సాహస యా త్రలో పాల్గొ న్న సతీష్‌కుమార్‌కు మందస ప్రజలు అభినందనలు తెలిపారు.  

గర్వంగా ఉంది 
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆర్మీ సాహస యాత్ర చేయడానికి నిర్ణయించింది. 12 మందితో కూడిన బృందం, 12 రాష్ట్రాల మీదు గా 18వేల కిలోమీటర్లు యాత్ర చేయడానికి సంకల్పించాం. వివిధ రాష్ట్రాల్లోని వాతావరణాలను తట్టుకున్నాం. నిజంగా సాహసంగానే యాత్ర జరిగింది. పెద్ద లక్ష్యం, రోజూ వందల కిలోమీటర్ల ప్రయాణం. సమస్యలు ఎన్ని వచ్చినా అధిగమించాం. చైనా బోర్డరును దాటాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం గర్వకారణంగా ఉంది. ఈ యాత్రతో మందసకు పేరు రావడం ఆనందంగా ఉంది.       
– డుంకురు సతీష్‌కుమార్, సాహస బృందం సభ్యుడు, మందస

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement