సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఆరోపిస్తున్నట్లుగా అరుణ్ పిళ్లై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి కాదని పిళ్లై తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టుకు తెలిపారు. అదేవిధంగా కుంభకోణంలో పిళ్లై పాత్ర లేదని పేర్కొన్నారు. మద్యం వ్యాపారంలో పిళ్లై సొంత సొమ్ము పెట్టుబడిగా పెట్టారని, మరెవరో సొమ్ము ఇండో స్పిరిట్స్‌లో పెట్టుబడిగా పెట్టలేదని స్పష్టం చేశారు. సొంత సొమ్ముతోనే భూములు కొనుగోలు చేశారని తెలిపారు. మద్యం పాలసీ రూపకల్పన, కిక్‌బ్యాక్స్‌లో కూడా పిళ్లై పాత్ర లేదని వివరించారు. కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ విచారించారు.
ఆధారాల్లేకుండానే అరెస్టు చేశారు..
పిళ్లై తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వాంగ్మూలం రికార్డు చేసిన మూడు రోజులకే పిళ్లై దాన్ని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. స్టేట్‌మెంట్ రికార్డు చేసే సమయంలో అరెస్టు చేస్తామని అధికారులు బెదిరించడంతో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ సంతకం చేయాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా పిళ్లైని అరెస్టు చేశారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, వాంగ్మూలం ఉపసంహరించుకున్నారంటూ బెయిల్ వ్యతిరేకించడం సరికాదని పేర్కొన్నారు. ఈడీ ఆరోపిస్తున్నట్లుగా పిటిషనర్ 2021, మార్చి 17 వరకూ ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో లేరని, మార్చి 16నే ఖాళీ చేశారని తెలిపారు.
శరత్‌చంద్రారెడ్డి, బుచ్చిబాబులు మాత్రం మార్చి 17, 2021 వరకూ ఆ హోటల్‌లో ఉన్నారని తెలిపారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మార్చి 18, 2021న ఎక్సైజ్ శాఖ కార్యదర్శి డ్రాఫ్టు పాలసీ ఇచ్చారని, మార్చి16న హోటల్ ఖాళీ చేసిన పిటిషనర్ పాలసీని ఎలా ప్రింట్‌అవుట్ తీస్తారని ప్రశ్నించారు. కాగా తీర్పును రిజర్వు చేస్తున్నామని, ఈ నెల 8న బెయిల్‌పై నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పారు. ఇలావుండగా ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటుపై విచారణను న్యాయమూర్తి జూలై 6కు వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: ఉద్యోగులకు సొంత జిల్లాల్లో ‘నో పోస్టింగ్’.. మూడేళ్లకు మించి ఒకే జిల్లాలో ఉంటే బదిలీ
Comments
Please login to add a commentAdd a comment