
రాష్ట్ర హోదా పునరుద్ధరణ కూడా..
శ్రీనగర్‌లో ప్రకటించిన ప్రధాని మోదీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయని ప్రధాని మోదీ చెప్పారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. గురువారం సాయంత్రం శ్రీనగర్‌లో రూ.1,500 కోట్ల విలువైన 84 అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్‌లో ఇటీవలి ఉగ్రదాడులకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
జమ్మూకశ్మీర్ శత్రువులకు తగు రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న జమ్మూకశ్మీర్ యువతను ఆయన అభినందించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అడ్డుగోడ తొలగిపోయిందని, జమ్మూకశ్మీర్‌లో నేడు భారత రాజ్యాంగం నిజంగా అమలవుతోందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతంగా శాంతిని నెలకొల్పుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
శ్రీనగర్‌లో నేడు యోగా డే
అంతకుముందు, జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనకు గాను గురువారం సాయంత్రం శ్రీనగర్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్(ఎస్‌కేఐసీసీ)వద్ద ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు దాల్ సరస్సు సమీపంలోని ఎస్‌కేఐసీసీలో జరిగే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 7 వేల మందికి పైగా పాలుపంచుకుని ఆసనాలు వేస్తారు.