సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ
గాంధీజీ సబర్మతి ఆశ్రమంలోకి మారిన రోజు ఇది. సబర్మతీ ఆశ్రమాన్నే.. గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా అంటారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నది ఒడ్డున స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఈ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. గాంధీజీ తన భార్య కస్తూర్బాతో పాటు ఇక్కడ పన్నెండేళ్లు నివాసమున్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఈ ఆశ్రమం కీలక పాత్ర పోషించింది.
ఉద్యమంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైనవి ఇక్కడి నుండే ప్రారంభమయ్యాయి. అంతకుక్రితం గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రాగానే జీవన్ లాల్ దేశాయ్ అనే స్నేహితుడి బంగళాలో 1915 మే 25 న ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో ఆ ఆశ్రమాన్ని సత్యాగ్రహ ఆశ్రమంగా పిలిచేవారు. ఐతే గాంధీజీ తన ఆశ్రమంలో వ్యవసాయం, పశుపోషణ చేపట్టాలనుకోవడంతో ఎక్కువ స్థలం అవసరమైంది. అందుకోసం రెండు సంవత్సరాల తర్వాత 1917 జూన్ 17న సబర్మతీ నది ఒడ్డున 36 ఎకరాల సువిశాల స్థలానికి ఆశ్రమాన్ని తరలించారు.
ఈ ఆశ్రమం జైలుకు, శ్మశానానికి మధ్యలో ఉండేది. ఒక సత్యాగ్రాహి ఇలా అనేవారట : ఈ రెండింటిలో ఏదో ఒక చోటుకు వెళ్లవలసి వస్తుంది కాబట్టి దీన్ని అనువైన ప్రదేశంగా గాంధీజీ భావించారు’’అని. గాంధీజీ ఈ ఆశ్రమంలో ఉండగానే వ్యవసాయం, అక్షరాస్యత మొదలైన అంశాల మీద శిక్షణ ఇచ్చేందుకు ఒక పాఠశాలను కూడా నెలకొల్పారు. గాంధీజీ ఈ ఆశ్రమం నుంచే 1930 మార్చి 12 న అక్కడికి 241 మైళ్ల దూరంలో ఉన్న దండికి 78 మంది అనుచరులతో పాదయాత్ర ప్రారంభించాడు. బ్రిటిష్ వారు ఉత్పత్తి చేసే ఉప్పును భారతీయులకు అమ్మేందుకు పన్నిన కుట్రకు; స్వదేశీ ఉప్పు మీద పాలకులు విధించిన పన్నుకు నిరసనగానూ ఈ ఉద్యమం సాగింది.
ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ప్రభుత్వం గాంధీజీ స్మారక కేంద్రాన్ని నడుపుతోంది. మొదట్లో ఈ మ్యూజియంని ఆశ్రమంలో గాంధీజీ నివసించిన హృదయకుంజ్ అనే కుటీరంలో ఏర్పాటు చేశారు. తరువాత 1963లో ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా ఒక మ్యూజియాన్ని రూపకల్పన చేశారు. ఆ మ్యూజియాన్ని 1963 మే 10 న అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇక్కడ గాంధీజీ జీవితానికి సంబంధించిన ఛాయాచిత్రాలు, ఆయన రాసిన ఉత్తరాలు, సందేశాలు, ఆయన జీవితంపై వచ్చిన సాహిత్యం, చిత్రాలు పొందుపరిచారు. ఆశ్రమ ప్రాంగణంలోనే వినోబా–మీరా నివసించిన వినోబా–మీరా కుటీరం, ప్రార్థనా భూమి, కుటీర పరిశ్రమలకు శిక్షణనిచ్చే కేంద్రం మొదలైనవి ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఉదయం 8:30 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు.
Comments
Please login to add a commentAdd a comment