బ్లాక్‌ అండ్‌ వైట్‌ నక్షత్రం | Azadi Ka Amrit Mahotsav Mohammed Yusuf Khan Called Dilip Kumar | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ అండ్‌ వైట్‌ నక్షత్రం

Published Thu, Jul 21 2022 1:39 PM | Last Updated on Thu, Jul 21 2022 1:39 PM

Azadi Ka Amrit Mahotsav Mohammed Yusuf Khan Called Dilip Kumar - Sakshi

నిరుడు ఈ నెలలోనే 7వ తేదీన కన్నుమూసిన దిలీప్‌కుమార్‌ వంటి ఒక కీర్తినార్జించిన వ్యక్తి జీవితంలోని విశేషాంశాలను తెలుసుకోవాలని ఆరాటపడుతున్న ఆయన అభిమానుల నిరీక్షణ ఏడేళ్ల క్రితమే 2014లో విడుదలైన ఆయన ఆత్మకథ ‘సబ్‌స్టెన్స్‌ అండ్‌ షాడో’లో ఫలించి ఉంటుంది. తన గురించి ఏదీ వదలకుండా ఆ పుస్తకంలో రాసుకున్నారు దిలీప్‌ కుమార్‌. పుస్తకంలో అనేక రహస్యోద్ఘాటనలతో పాటు.. దిలీప్‌కుమార్, సైరాబానుల ప్రేమకథ, లోకల్‌ ట్రైయిన్‌లో లతామంగేష్కర్‌తో అయిన తొలిపరిచయం, తొలిచిత్రం ‘జ్వార్‌ భాటా’ (1944) నుంచి ‘జుగ్ను’ (1947) వరకు యువనటుడిగా ఆయన ఎదుగుదల వంటి ఆసక్తికరమైన సాధారణ అంశాలు చాలానే ఉన్నాయి.

దిలీప్‌ జీవితచరిత్ర కోసం ఒక అభిమానిలా తను కూడా ఏళ్లుగా కలగంటున్నానని పుస్తకం ఆవిష్కరణ రోజు సైరా చెప్పడం విశేషం. దిలీప్‌కుమార్‌ అసలు పేరు మహమ్మద్‌ యూసఫ్‌ఖాన్‌. 1922 డిసెంబరు 11న పెషావర్‌ (ఇప్పటి పాకిస్థాన్‌)లో జన్మించారు. ఆరు దశాబ్దాలు సినిమాల్లో ఉన్నారు. పద్మభూషణ్, దాదాసాహెబ్‌ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.

దేవానంద్‌ మరణం తర్వాత బాలివుడ్‌కు మొన్నటి వరకు మిగిలి ఉన్న ఏకైక నలుపు–తెలుపు చిత్రాల సూపర్‌స్టార్‌ దిలీప్‌. దిలీప్‌కుమార్‌ తండ్రి లాలా గులామ్‌ సర్వర్‌ పండ్ల వ్యాపారి. పెషావర్‌లో, దేవ్‌లాలి (మహారాష్ట్ర)లో ఆయనకు పండ్ల తోటలు ఉండేవి. దిలీప్‌ దేవ్‌లాలిలోని ప్రతిష్టాత్మకమైన బార్నెస్‌ పాఠశాలలో చదువుకున్నారు. 1930లలో వారి కుటుంబం ముంబైకి మారింది. 1940 ప్రాంతంలో దిలీప్‌ ఇంటిని వదిలి పుణె వెళ్లి అక్కడ క్యాంటీన్‌ నడిపారు. డ్రైఫ్రూట్స్‌ బిజినెస్‌ చేశారు. 1943లో నటి, ‘బాంబే టాకీస్‌’ అధినేత అయిన దేవికారాణి... పుణె మిలటరీ క్యాంటిన్‌లో దిలీప్‌ను చూసి ‘జ్వార్‌ భాటా’ లో ప్రధాన పాత్ర ఇచ్చారు.

అలా దిలీప్‌ సినిమాల్లోకి వచ్చేశారు. కొన్ని చిత్రాలకు నిర్మాణ భాగస్వామ్యం వహించారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. దిలీప్‌ మొదట ప్రేమించింది నటి కామినీ కౌశల్‌ని. కానీ పెళ్లి దాకా పోలేదు. మధుబాలకు దగ్గరయ్యారు. మధుబాల కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఆమెనీ పెళ్లి చేసుకోలేకపోయాడు. తర్వాత అందాల నటి సైరాబానును ప్రేమించి 1966లో పెళ్లి చేసుకున్నారు.

సైరాబాను అతడికన్నా 22 ఏళ్లు చిన్న. 1980లో ఆస్మాను పెళ్లాడారు. ఆ పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. 2011 నాటికి దిలీప్‌ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. భార్య సైరాబానుతో కలిసి తన జీవితంలో తొలిసారిగా మక్కా వెళ్లి వచ్చారు దిలీప్‌ కుమార్‌. ఇంతకీ యూసఫ్‌ ఖాన్‌ దిలీప్‌కుమార్‌ ఎలా అయ్యాడు? ప్రఖ్యాత నవలాకారుడు, సినిమా రచయిత భగవతీ చరణ్‌ వర్మ పెట్టిన పేరది! వాసుదేవ్, జహంగీర్, దిలీప్‌కుమార్‌ అని మూడు పేర్లు చెప్పి ఒకటి పెట్టుకోమన్నప్పుడు యూసఫ్‌... దిలీప్‌ అనే పేరును ఎంచుకున్నారు.  

(చదవండి: చైతన్య భారతి: టెస్సీ థామస్‌ / 1963 అగ్ని పుత్రిక)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement