ఆజాదీ ఉద్వేగస్వరం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. బాలూ ఆలపించిన దేశభక్తి గీతాల్లో.. ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి’, ‘జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరియసి..’.. ప్రతి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల నాడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మార్మోగిపోతుంటాయి. బాలూ జీవించి ఉంటే ఇప్పుడీ ఆజాదీ ఉత్సవాలకు ఆయన గళం అమృతోత్సవ స్వర వర్ణాలను అద్ది ఉండేది. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆ రెండు పాటల పల్లవులు, చరణాల్లోని కొన్ని భాగాలు.
పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహా మహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం.. నా దేశం ..!
‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం (1993) లోని ఈ పాటకు సాహిత్యం జాలాది. సంగీతం ఎం.ఎం. కీరవాణి. సాహిత్యంలోని దేశభక్తి భావోద్వేగాలన్నిటినీ సంగీతానికి తగ్గట్లుగా ఒడలు పులకించేలా ఎప్సీ తన గళంలో పలికించారు. అదుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి / అడుగొ అరి భయంకరుడు కట్ట బ్రహ్మన / అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన / వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి / అజాదు హిందు ఫౌజు దళపతీ నేతాజీ / అఖండ భరత జాతి కన్న మరో శివాజీ.. అని ఎస్పీ పాడుతున్నప్పుడు ఆనాటి సమరయోధులంతా కనుల ముందు సాక్షాత్కరించినట్లే ఉంటుంది.
జనని జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరియసి / ఏ తల్లి నిను కన్నదో / ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
నీ తల్లి మోసేది నవమాసలేరా / ఈ తల్లి మోయాలి కడవరకురా.. కట్టే కాలేవరకురా
ఆ రుణం తలకొరివితో తీరెనురా / ఈ రుణం ఏ రుపానా తీరేదిరా / ఆ రూపమే ఈ జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా.. అనే ఈ దేశభక్తి గీతం ‘బొబ్బిలిపులి’ చిత్రం (1982) లోనిది. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం జె.వి.రాఘవులు. పాడింది ఎస్పీబీ. ఈ గీతంలో ఆయన ధీర గంభీర స్వరం.. శతఘ్నిలా ప్రతిధ్వనించి ప్రతి జవాను హృదయం ఉప్పెంగేలా చేస్తుంది.
ఎస్పీబీ వ్యక్తిగతంగా కూడా బాధ్యత గల దేశ పౌరుడిగా ఉండేవారు. కరోనా సమయంలో ప్రజల్లో భయాందోళనలు పోగొట్టి వారికి ధైర్యం చెప్పడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశమంతటా ఒక ఐక్యతా కార్యక్రమంగా దీపాలు వెలిగించి, పళ్లేలు మోగించాలని చెప్పినప్పుడు ఎస్పీబీ తు.చ. తప్పకుండా ఆ సూచనను పాటించారు. అంతేకాదు, యువతరాన్ని అందుకు మోటివేట్ చేశారు కూడా!
Comments
Please login to add a commentAdd a comment