
రైలు లేటొస్తే.. తిట్టుకుంటాం.. మరి ముందొస్తేనో.. మీరైతే ఏం చేస్తారో తెలియదు గానీ.. మధ్యప్రదేశ్‌లోని రాట్లం రైల్వే స్టేషన్‌లో మాత్రం జనం ఆశ్చర్యం ప్లస్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. డ్యాన్స్ చేశారు. బుధవారం బాంద్రా–హరిద్వార్ రైలు రావాల్సిన టైం కన్నా.. 20 నిమిషాలు ముందే వచ్చింది. అప్పటికే బోర్ కొట్టి కూర్చున్న గుజరాతీ ప్రయాణికుల గ్రూపుకు విషయం తెలిసింది.
అంతే.. రైలు ముందు రావడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే.. బయలుదేరడానికి బోలెడంత సమయం ఉండటంతో గార్బా నృత్యం చేయడం మొదలుపెట్టారు.. వాళ్ల ఆనందాన్ని చూసిన ఇంకొంతమంది వారికి జత కలిశారు. మొత్తానికి రైల్వే ప్లాట్‌ఫామ్ కాస్తా డ్యాన్స్ వేదికగా మారిపోయింది. ఈ వీడియో కాస్తా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి వెళ్లింది. ఆయన దాన్ని సామాజికమాధ్యమం ‘కూ’లో పంచుకోవడంతో తెగ వైరల్ అయ్యింది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్