సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మద్యం మాఫియా ఆగడాలను అరికట్టేందుకు, కరోనా కారణంగా తగ్గిన ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా కేజ్రీవాల్ సర్కార్ నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. నూతన పాలసీ ప్రకారం వినియోగదారులకు ఇప్పుడు మద్యం షాపులలో వాక్–ఇన్ అనుభవం లభిస్తుంది. అంతేగాక హోటళ్ళు, క్లబ్బులు, రెస్టారెంట్లలోని బార్‌లను ఇకపై తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకొనేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటితో పాటు బాల్కనీలు, టెర్రస్‌ల వంటి ఓపెన్ స్పేస్‌లలో సీటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసిన రెస్టోబార్లలోను మద్యం సరఫరా చేసేందుకు అవకాశం కల్పించారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో, రాష్ట్ర ప్రభుత్వమద్యం దుకాణాల సంఖ్య తగ్గడంతోపాటు, ప్రైవేట్ మద్యం సంస్థలకు లాభం చేకూరనుంది. అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ప్రపంచంలోని 28వ నగరంగా ఢిల్లీ ఉంది.ఈ పరిస్థితుల్లో విదేశీ పర్యటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఆదాయాన్ని పెంపేక్ష్యంగామద్యం పాలసీలో మార్పులు చేసినట్లుగా తెలిసింది.
నూతన మద్యం పాలసీ ప్రభావం: కొత్త పాలసీ ప్రకారం మద్యం రిటైల్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేస్తారు. దుకాణాలకు మద్యం ఏకరీతి పంపిణీ కోసం ప్రతి మునిసిపల్ వార్డులో కనీసం 2 ఎయిర్ కండిషన్డ్ వెండ్స్, 5 సూపర్ ప్రీమియం దుకాణాలు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 దుకాణాలను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 849 మద్యం రిటైల్ స్టోర్స్ ఉంటాయి.
మద్యం అమ్మకం నుంచి ప్రభుత్వం దూరం: ఢిల్లీ కన్సూ్యమర్స్ కోఆపరేటివ్ హోల్‌సేల్ స్టోర్ లిమిటెడ్ (డిసిసిడబ్లు్యఎస్), ఢిల్లీ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డిఎస్‌ఐఐడిసి) వంటి సంస్థల ద్వారా జరుగుతున్న మద్యం అమ్మకం వ్యాపారం నుంచి ప్రభుత్వం నిష్క్రమిస్తుందని ఈ విధానం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న రిటైల్ విక్రేతల లైసెన్సులు సెప్టెంబర్ 30 వరకు చెల్లుతాయి. అయితే రిటైల్ దుకాణాల నుంచి ఇన్‌పుట్స్ తీసుకొని, పొరుగు రాష్రాల ఉత్పత్తి ధరను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మద్యం బ్రాండ్ల ధర నిర్ణయించనున్నట్లు కొత్త విధానం పేర్కొంది. ఢిల్లీతో పోలిస్తే హరియాణాలో మద్యం చౌకగా ఉన్న కారణంగా, మద్యం అక్రమ రవాణాకు దారితీస్తోంది.
మద్యం దుకాణాల్లోకి వాక్ ఇన్ అనుభవం: ప్రతి మద్యం దుకాణం తన వినియోగదారులకు వాక్–ఇన్ అనుభవాన్ని కల్పించాల్సి ఉంటుంది. దుకాణంలోకి వెళ్ళిన కస్టమర్ నచ్చిన బ్రాండ్ మద్యం ఎంచుకోగలుగుతారు. వెండింగ్ మెషీన్ వద్ద కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది. అలాంటి రిటైల్ దుకాణాలన్నీ ఎయిర్ కండిషన్డ్‌గా, మాల్స్‌లో ఉండే షాపుల మాదిరిగా తయారవుతాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు అవకాశం: ఇకపై లైసెన్స్ పొందిన బార్లలో బీరు సరఫరా చేయడానికి మైక్రో బ్రూవరీస్ అనుమతించనున్నారు. హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలోని బార్లలో తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం తాగేందుకు అనుమతించారు. ఎల్–38 పేరుతో ప్రభుత్వం కొత్త లైసెన్స్‌ను ప్రవేశపెట్టింది. బాంకెట్ హాళ్లు, పార్టీ చేసుకొనే ప్రదేశాలు, ఫామ్ హౌస్‌లు, మోటల్స్ లేదా వివాహాలు వంటి కార్యక్రమాల్లోదేశీ, విదేశీ మద్యం సేవించడానికి వన్ టైమ్ వార్షిక ఫీజు వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment