‘‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ ‘బొమ్మరిల్లు’ హాసిని చెప్పిన ఈ డైలాగ్.. కప్పు కాఫీ తాగుతూ, నాలుగు మాటలు మాట్లాడుకోవడంలోని మజాని తెలియజేస్తుంది. చాలామందికి పొద్దున్నే సూర్యుని కన్నా ముందుగా కాఫీ కనిపిస్తుంది. దానిని ఆస్వాదించిన తరువాతనే వారి దినచర్య మొదలవుతుంది. ఏది ఏమైనా కాఫీ సేవనం మనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందనడంలో సందేహం లేదు.
ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇటీవల బెంగళూరులో జరిగిన 5వ వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ (డబ్ల్యుసీసీ) ఘుమఘుమలు ప్రపంచాన్నంతటినీ తాకాయి. 2023 సెప్టెంబర్ 25 నుండి 28 వరకు బెంగళూరులోని ప్రసిద్ధ బెంగళూరు ప్యాలెస్‌లో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ జరిగింది. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, కాఫీ పరిశ్రమల సహకారంతో అంతర్జాతీయ కాఫీ సంస్థ (ఐసీఓ)ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సదస్సును ప్రారంభించారు.
నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలు సమావేశాలు, స్కిల్ బిల్డింగ్ వర్క్‌షాప్‌లు, స్టార్టప్ సమ్మిట్‌లు నిర్వహించారు. అలాగే పలు రకాల పోటీలు నిర్వహించి, విజేతలకు బహమతులు, అవార్డులు అందజేశారు. ప్రపంచ కాఫీ సమ్మేళనంలో 2400 మంది ప్రతినిధులు, 128 మంది స్పీకర్లు, 208 మంది ఎగ్జిబిటర్లు, 10 వేల మంది సందర్శకులు పాల్గొన్నారు.
ప్రస్తుతం 60 దేశాల్లో కాఫీని పండిస్తుండగా, యూరప్, అమెరికా, జపాన్ తదితర దేశాలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కాఫీ వినియోగదారుగా అమెరికా అగ్రస్థానంలో ఉండగా, భారీ కాఫీ ఉత్పత్తిదారుగా బ్రెజిల్ నిలిచింది. కాఫీని అధికంగా ఉత్పత్తి చేసే ఆరు దేశాల సరసన భారత్ కూడా చేరింది.
ఇదికూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు?
Comments
Please login to add a commentAdd a comment