మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం
పాట్నా: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం కాటేసింది. మోతిహారీ జిల్లా లక్ష‍్మీపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించిన కొందరి పరిస్థితి విషమించింది. ఇప్పటివరకు 20 మంది మరణించగా.. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు.
బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం 2016లోనే మద్యపాన నిషేధం విధించింది. అయినప్పటికీ కల్తీ మద్యాన్ని జోరుగా విక్రయిస్తున్నారు. ఇది తాగి అమాయకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజా ఘటనపై సీఎం నితీశ్ స్పందించారు. ఘటన బాధాకరమన్న ఆయన.. విచారణ కొనసాగుతుందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో కూడా సివాన్‌లో కల్తీమద్యం సేవించి నలుగురు చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి అక్రమంగా ఆల్కహాల్ విక్రయించిన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
లిక్కర్ మాఫియా.. శానిటైజర్ తయారు చేస్తామని చెప్పి కోల్‌కతా నుంచి ఇథేనాల్ తీసుకొచ్చి మద్యం తయారు చేస్తోందని పోలీసులు తెలిపారు. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్సైజ్ శాఖ 15 మంది లిక్కర్ వ్యాపారులను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
గతేడాది బిహార్‌లోని ఛప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా ఏకంగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్లాక్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
కాగా.. కల్తీమద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించే ప్రసక్తే లేదని సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. తాగితే చస్తారని, మద్యం జోలికి వెళ్లొద్దని కరాకండీగా చెప్పారు.
చదవండి: అసద్ అంత్యక్రియలు పూర్తి.. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ
Comments
Please login to add a commentAdd a comment