
తిరువనంతపురం: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ వేడి రాజుకుంటోంది. పోటాపోటీ విమర్శనాస్త్రలు సంధించుకుంటున్నాయి అధికార ప్రతిపక్ష బీజేపీ-కాంగ్రెస్‌లు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో బీజేపీకి .. 2019 తరహా మ్యాజిక్ ఏమాత్రం పని చేయదని జోస్యం చెప్పారాయన. అంతేకాదు.. లోక్‌సభ తరపున బీజేపీ 50 సీట్ల దాకా కోల్పోవడం ఖాయమంటూ శుక్రవారం కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌కు హాజరై థరూర్ వ్యాఖ్యలు చేశారు. ‘‘వచ్చే ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీ సీట్లు కోల్పోతుంది. అలాగే.. కేంద్రంలో కూడా అధికారం కోల్పోయే అవకాశాలను కొట్టిపారేయలేం కూడా. అందుకు 2019 ఎన్నికలే ఓ నిదర్శనం..
2019 ఏడాదిని ఓసారి పరిశీలిస్తే.. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ సాధించిన సీట్ల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పుల్వామా దాడులు, బాలకోట్ స్ట్రైక్.. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీకి బాగా కలిసొచ్చాయి. కానీ, మళ్లీ అది పునరావృతం కాకపోవచ్చని ఈ తిరువనంతపురం ఎంపీ అభిప్రాయపడ్డారు.
ఒకవేళ యాభై స్థానాల్లో బీజేపీ ఓడితే.. మిగతా పార్టీలన్నీ మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు అవుతుంది. అలాంటప్పుడు అవతలి పార్టీ నుంచి ఎంపీలను లాక్కుని అధికార ఏర్పాటు చేయడం లేదంటే ప్రభుత్వాన్ని సుస్థిరపర్చుకోవడం లాంటి ప్రయత్నాలను బీజేపీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చెప్పలేం అంటూ థరూర్ కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment