
న్యూఢిల్లీ: బాలీవుడ్ డ్రగ్ వ్యవహారంపై పార్లమెంట్‌లో ప్రసంగించిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్‌కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వై-ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ రవి కిషన్ బాలీవుడ్ డ్రగ్స్ నెక్సస్ లింగ్‌లపై ప్రస్తావించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీకి, ఆయన కుటుంబానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వై-ప్లస్ భద్రతను కల్పించారు. దీంతో తనకు తన కుటుంబానికి, నియోజకవర్గ ప్రజలకు భద్రత కల్పించినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ట్విటర్ వేదికగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: రవి కిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు)
‘గౌరవనీయులైన మహారాజ్ జి, నా భద్రతను దృష్టిలో ఉంచుకుని నాకు వై-ప్లస్ కేటగిరి భద్రతను కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు. అంతేగాక నా కుటుంబంతో పాటు లోక్‌సభ నియోజకవర్గ ప్రజల క్షేమం గురించి ఆలోచించిన మీకు మేమంతా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రజల తరపున సభలో నా గొంతు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని మీకు మాటఇస్తున్నాను’ అంటూ ఎంపీ ట్వీట్ చేశారు. అయితే బాలీవుడ్‌లో ప్రస్తుతం కలకలం రేపుతోన్న డ్రగ్ కేసు వ్యవహారంపై ఎంపీ రవి కిషన్ పార్లమెంటులో ఇటివల ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగిస్తున్న క్రమంలో ఎంపీ జయబచ్చన్‌తో సహా పలువురు ఎంపీలు ఆయనను వ్యతిరేకించారు. (చదవండి: బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...)