న్యూఢిల్లీ: 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విపక్ష రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది బీజేపీ. 2019 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో అనూహ్యంగా పుంజుకుంది. 42 పార్లమెంట్ స్థానాలకు గానూ ఏకంగా 18 స్థానాలు సాధించింది. అదే ఊపును 2024లోనూ కనబరచాలని తహతహలాడుతోంది. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ముగ్గురు కేంద్ర మంత్రులకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించింది.
కేంద్ర మంత్రులు ధర్మేద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, జోతిరాదిత్య సింధియాలకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించింది బీజేపీ. ఇప్పటికే.. ఆయా మంత్రులు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి సహా స్థానిక ఎన్నికల్లో పార‍్టీ ఓడిపోయిన ప్రాంతాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హాకు సైతం ఈ రాష్ట్రానికే పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్.. ఉపరాష్ట్రపతి అయిన క్రమంలో బెంగాల్‌పై ఇతర ఛానల్స్ ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. ఇటీవల ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. దీంతో బీజేపీ, టీఎంసీ మధ్య ఒప్పందం వంటి ఆరోపణలను తిప్పికొట్టాలని రాష్ట్ర శాఖను ఆదేశించారు నేతలు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు బెంగాల్‌లో సువేందు అధికారితో పాటు పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో 42 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు.. మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అప్పగించనున్నారని సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీలు బెంగాలీలో అనార్గళంగా మాట్లాడగలరు. అది మరింత ప్రయోజనం చేకూర్చనుంది. జోతిరాదిత్య సింధియాకు అతిపెద్ద నియోజకవర్గం దమ్‌దమ్‌ను అప్పగించనున్నారు.
ఇదీ చదవండి: బెంగాల్ రాజకీయాల్లో కలకలం.. ఎవరీ అనుబ్రతా మోండల్?
Comments
Please login to add a commentAdd a comment