
తిరువనంతంపురం : కేరళలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో కేరళ దద్దరిల్లగా ఇప్పుడు మైకులు మూగబోయాయి.
ఏప్రిల్ 24న సాయంత్రం 6 గంటలకు ప్రచార పర్వం ముగియడంతో నియోజకవర్గంలో ప్రచారాన్ని పూర్తిగా ఆపేయాలని, సోషల్ మీడియా లోనూ ఎలాంటి ప్రచారం చేయొద్దని ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని ఎన్నికల ప్రధాన అధికారి సంజయ్ కౌల్ అన్నారు.
సెక్షన్ 144 ప్రకారం చర్యలు
ఇకపై స్థానికేతరులు నియోజకవర్గాల్లో తిరిగినా, ప్రజలు గుమిగూడినా లేదా బహిరంగ సభలు నిర్వహించినా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు. లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడం నిషేధం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఎలాంటి సినిమా, టెలివిజన్ కార్యక్రమాలు, ప్రకటనలు, సంగీత కార్యక్రమాలు, నాటకాలు, ప్రదర్శనలు, ఒపీనియన్ పోల్స్, పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి లేదన్నారు.
కఠిన చర్యలు తప్పవ్
నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానాలు లేదంటే ఒకేసారి రెండింటిని ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. చివరి దశ ఓటింగ్ పూర్తయిన అరగంట వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం విధిస్తున్నట్లు సూచించారు.
కాగా, కేరళలో 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.