ప్రతీకాత్మక చిత్రం
ముంబై : భార్య టీ పెట్టననడం భర్తను రెచ్చగొట్టడం కాదని.. దాన్ని సాకుగా చూపి.. భర్త ఆమెపై దాడి చేయడం సమంజసం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్యపై దాడి చేసినందుకు 35 ఏళ్ల వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు, భర్తకు టీ తయారు చేయడానికి భార్య నిరాకరించడాన్ని ఆమెపై దాడి చేయడానికి రెచ్చగొట్టే చర్యగా అంగీకరించలేమని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ రేవతి మోహితే దేరే మాట్లాడుతూ ‘‘భార్య అంటే చరాస్తి.. వస్తువు కాదు. వివాహం అనేది సమానాత్వం మీద ఆధారపడిన స్నేహం. వాస్తవంగా మాత్రం అలా ఉండటం లేదు. ఇలాంటి కేసులు సహజమైనవి కావు. ఇది లింగం - వక్రీకృత పితృస్వామ్య వ్యవస్థని సూచిస్తోంది. ఇది తరచూ వైవాహిక సంబంధంలోకి వస్తుంది. సమాజంలోని పితృస్వామ్య భావనల వల్ల, స్త్రీ పురుషుడి ఆస్తి అనే ఆలోచన సమాజంలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. ఈ భావన ఒక వ్యక్తి తన భార్యను అతడి చరాస్థిగా భావించడానికి దారి తీస్తోంది’’ అని కోర్టు అభిప్రాయపడింది.
‘‘సమాజంలోని లింగ వివక్షత వల్ల ఇంటి పని బాధ్యత భార్యదే అనే భావం పాతుకుపోయింది. ఈ లింగ వివక్షత వల్ల భార్య ఇంటి పనికే పరిమితం అయ్యింది. ఆ పనులన్ని ఆమెకు కేటాయించినవే అనే భావం పాతుకుపోయింది. ఇక వివాహంలో భార్య నుంచి భావోద్వేగ శ్రమను కూడా ఆశిస్తున్నారు. సామాజిక పరిస్థితులు కూడా మహిళను తన అత్తారింటికి అంకితం అయ్యేలా ప్రేరేపిస్తున్నాయి. దాంతో మగవారు భార్యలను తమ స్తిరాస్తిగా భావిస్తున్నారు’’ అని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసుకు సంబంధించి దంపతుల కుమార్తె చెప్పిన సాక్ష్యాన్ని బాంబే హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేసింది. ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. భర్తకు కింది కోర్టు విధించిన శిక్షను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
కేసు ఏంటంటే..
సోలాపూర్ జిల్లాలోని పంధర్‌పూర్ ప్రాంతానికి చెందిన సంతోష్ అక్తర్ అనే వ్యక్తికి భార్యతో తరచు ఏదో ఓ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలో 2013 డిసెంబర్‌లో వీరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అక్తర్ తన భార్యను అతడికి ఒక కప్పు టీ పెట్టి ఇవ్వాల్సిందిగా కోరాడు. ఆమె అదేం పట్టించుకోకుండా బయటకు వెళ్లిపోయింది. దాంతో ఆగ్రహానికి గురైన అక్తర్ భార్యపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఈ గొడవకు ఇంట్లో నిద్రపోతున్న ఆరేళ్ల కుమార్తె బయటకు వచ్చి చూడగా.. తండ్రి తల్లిని దారుణంగా కొట్టడం కంట పడింది.
ఆ తర్వాత అక్తర్ ఘటన జరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేసి.. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు అక్తర్. ఆమె స్పృహలోకి రావడానికి వారం రోజులు పట్టింది. అనంతరం ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. భార్య టీ పెట్టడానికి నిరాకరించి తనను రెచ్చగొట్టిందని.. అందుకే దాడి చేశానని తెలిపాడు అక్తర్. ఇందుకు గాను స్థానిక కోర్టు 2016లో అక్తర్‌కి పదేళ్ల జైలు శిక్ష విధించింది. నరహత్య ఆరోపణలపై అతడికి ఈ శిక్ష విధించింది. దాంతో అతడు బాంబే హై కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టు తీర్పును హై కోర్టు సమర్థించింది.
చదవండి:
నిరసన: జడ్జికి కండోమ్‌లు పంపిన మహిళ..
న్యాయాన్యాయాల విచికిత్స
Comments
Please login to add a commentAdd a comment