
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలో జరిగే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. నూతన భవన నిర్మాణ పనులు దాదాపు ముగింపుకు వచ్చాయని, ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2023–24 ఆర్ధిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త భవనంలోనే ప్రవేశపెడతారని, ఇందుకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నాయి.
65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్లమెంట్ నూతన భవనంలో విశాలమైన హాళ్లు, ఆధునిక లైబ్రరీ, అత్యాధునిక రాజ్యాంగ హాలు, ఆధునిక సాంకేతికతతో కూడిన కార్యాలయాలు, కమిటీ గదులు ఉన్నాయి. కొత్త భవనంలోని లోక్‌సభలో 888 సీట్ల అమరిక నెమలి ఆకారాన్ని స్ఫూరించేలా, రాజ్యసభ హాలులో కమలం పువ్వును గుర్తుకు తెచ్చేలా 384 సీట్ల అమరిక ఉంటుంది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ పాత భవనంలోనే రాబోయే బడ్జెట్ సెషన్‌లో ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జనవరి 31న ప్రసంగిస్తారని స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం వెల్లడించారు. మరోవైపు లోక్‌సభ సెక్రటేరియట్ పార్లమెంటు కొత్త భవనాన్ని యాక్సెస్ చేయడానికి ఎంపీల కోసం కొత్త గుర్తింపు కార్డులను సిద్ధం చేస్తున్నారు. కొత్త భవనంలో వినియోగించే ఆడియో విజువల్ పరికరాలపై ఎంపీలకు శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ కొత్త భవనంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన పక్షంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగే తొలి విడత సమావేశాలను పాత భవనంలో, మార్చి 13 నుంచి జరిగే రెండో విడత సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించే అవకాశాలున్నాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి.