ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ బస్సు హైజాక్ కథ సుఖాంతమైంది. బస్సును అపహరించలేదని, బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐని సకాలంలో చెల్లించకోవడంతో బస్సును తీసుకెళ్లినట్లు ఓ ఫైనాన్స్ కంపెనీ వెల్లడించింది. ప్రయాణికులను సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. దీంతో ఆగ్రా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఆగ్రాలోని న్యూ సదరన్ బైపాస్ సమీపంలో బుధవారం వేకువజామున ఓ ప్రైవేట్ బస్సును గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బైపాస్ రోడ్ వద్ద బస్సుని ఆపిన దుండగులు మొదట బస్సు డ్రైవర్, హెల్పర్‌ను కిందకు దించేసి, ఆ తర్వాత బస్సును హైజాక్ చేసినట్లు తెలిసింది. ఆ బస్సు హర్యానాలోని గురుగ్రామ్ నుంచి మధ్యప్రదేశ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
దుండగులు మొదటగా తాము ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులమని చెప్పి బస్సు ఎక్కారని, తర్వాత డ్రైవర్, సహాయకుడిని బెదిరించి బస్సును అపహరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అసలు విషయం బయటపడింది. బస్సుపై రుణం తీసుకున్న యజమాని ఈఎంఐలు చెల్లించకపోవడంతో బస్సును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఫైనాన్స్ కంపెనీపై కేసులు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు బస్సును ఝాన్సీకి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment