బెంగుళూరు: భర్త నల్లగా ఉన్నాడని భార్యా అదేపనిగా కించపరచడాన్ని కర్ణాటక హైకోర్టు తప్పు బట్టింది. అదొక క్రూరమైన చర్యగా పరిగణిస్తూ.. దీన్నే బలమైన కారణంగ చెబుతూ ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు.
తన భర్త నల్లగా ఉన్నాడంటూ ఓ భార్య అతడిని తరచుగా ఆవమానించడంతో ఆ భర్త విసుగు చెంది విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయుయించాడు. కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత భర్త ఎంత నల్లగా ఉన్నా అతడు నల్లగా ఉన్నాడని ఎద్దేవా చేయడం క్రూరత్వమేనని తెలుపుతూ 44 ఏళ్ల భర్తకు తన 41 ఏళ్ల భార్య నుంచి విముక్తి కలిగిస్తూ విడాకులు మంజూరు చేసింది కర్ణాటక కోర్టు.
బెంగుళూరుకు చెందిన ఓ జంటకు 2007లో పెళ్లయింది. కొన్నాళ్ళకి వారిద్దరికి ఒక అడ బిడ్డ కూడా జన్మించింది. కానీ తరచుగా వారు గొడవ పడుతుండడం.. మాటల మధ్యలో నువ్వు నల్లగా ఉన్నావంటూ ఆమె తిట్టడం.. ఇదొక దైనందిన ప్రక్రియలా కొనసాగేది. దీంతో విసుగు చెందిన ఆ భర్త ఆమె నుండి వేరుగా ఉంటూ 2012లో విడాకుల కోసం ఫ్యామిలి కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డ కోసమే ఆ అవమానాలన్నిటినీ భరించానని ఇక తన వల్ల కాదంటూ పిటిషన్లో పేర్కొన్నాడు.
భర్త విడాకుల కోసం కోర్టుకెక్కడంతో కోపోద్రిక్తురాలైన ఆ భార్య.. తన అత్తమామలు తనను బాగా చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, అదనపు కట్నం తీసుకు రావాలంటూ వేధిస్తున్నారని చెబుతూ భర్త సహా అందరిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందంటూ ఆరోపణలు చేసింది. అనంతరం తన బిడ్డను తన తల్లిదండ్రుల వద్దకు పంపించేసింది. అయితే ఐదేళ్లపాటు సాగిన వాదనలు, వాయిదాలు తర్వాత 2017లో ఫ్యామిలి కోర్టు భర్త విడాకుల పిటిషన్ ను తోసిపుచ్చింది.
అయినా కూడా శాంతించని భర్త విడాకుల కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. చివరకు హైకోర్టు కేసు పూర్వాపరాలను పరిశీలించి ఆమె తన భర్తపై చేసిన అక్రమ సంబంధాల ఆరోపణలు నిరాధారమైనవి, నిర్లక్ష్యమైనవని తెలుపుతూ భర్త నల్లగా ఉన్నాడని అవమానించడం కౄరత్వంతో సమానమని చెబుతూ ఆ భర్త కోరినట్లుగా విడాకులు మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి: రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment