ముంబై: వర్షాకాలం ఇంకా పూర్తిగా ప్రవేశించనేలేదు.. అప్పుడే వరుణుడు దేశ ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేస్తున్నాడు. ఎడతెరపి లేని వర్షాలతో ముంబై నగరం చిగురుటాకులా వణికిపోతుంది. ఇంత భారీ వర్షాలు పడితే.. నగరాల్లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మ్యాన్‌హోళ్లు నోరు తెరుచుకుని ఉంటాయి. ప్రతి ఏటా కొందరినైనా తమలోకి లాగేసుకుంటాయి ఈ మృత్యుకుహరాలు. తాజాగా ముంబైలో ఇద్దరు మహిళలు మ్యాన్‌హోల్‌లో పడ్డారు అదృష్టం కొద్ది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వివరాలు.. ముంబైలోని భండప్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షం పడుతుండగా.. కొందరు వ్యక్తులు పేవ్‌మెంట్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తుంటారు. అలా వెళ్తుండగా ఓ మహిళ తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోతుంది. అదృష్టం కొద్ది వెంటనే బయటపడుతుంది. కొద్ది క్షణాల అనంతరం మరో మహిళ కూడా అలానే మ్యాన్‌హోల్‌లో పడుతుంది.. తాను కూడా క్షేమంగా బయటకు వచ్చింది.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ముంబై సివిక్ బాడీ, బీఎంసీ మీద విమర్శల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో ‘‘రుతుపవనాలకు ముందే నగరంలోని మ్యాన్‌హోల్స్‌ని తనిఖీ చేసి మరమత్తులు చేస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కార్పొరేషన్ మరోసారి అన్ని నగరంలోని అన్ని రోడ్లు, మ్యాన్‌హోల్స్‌ను పరిశీలిస్తోంది” అని పౌరసంఘం ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాన్‌హోల్స్‌కు అవసరమైన రీప్లేస్‌మెంట్ చేయాల్సిందిగా.. మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు మునిసిపల్ కమిషనర్ (ప్రాజెక్టులు) పి వెలారసు సంబంధిత విభాగాలకు కఠినమైన సూచనలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment