సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సుప్రీం కోర్టులో తన కేసును తానే వాదించాలని అనుకున్నారు. ఈ మేరకు కోర్టు కేసు స్టేటస్‌లో ఆ విషయం బయటకు వచ్చింది. అయితే.. సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు అంగీకరించగా.. ఆయన వేసిన పిటిషన్‌ను ఆగమేఘాల మీద శుక్రవారం వెనక్కి తీసుకున్నారు.
ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ నిన్న రాత్రే ఆయన అత్యవసర విచారణ కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అయితే ఆ టైంలో కోర్టు దానిని స్వీకరించలేదు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే సీజేఐ ధర్మాసనం విచారణకు అంగీకరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవస విచారణ చేపట్టాలని కోరారు ఆయన తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. దీంతో ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్‌కు పంపించారు.
అక్కడా అత్యవసర విచారణ జరపాలని లాయర్ సింఘ్వీ కోరగా.. రెగ్యులర్ కేసుల విచారణ తర్వాత స్పెషల్ బెంచ్ ఈ కేసును విచారిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అయితే.. రౌస్ ఎవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఈ అత్యవసర పిటీషన్ ఉపసంహరించుకున్నారాయన.
అలా వీలుందా?
మైలార్డ్.. యువర్ ఆనర్ అంటూ ఊగిపోతూ సినిమాల్లో సొంతంగా వాదించుకోవడం సినిమాల్లోనే మనం చూస్తున్నాం. కానీ, నిజ జీవితంలోనూ ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుంది. ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. లా చదవని ఆయన కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారనే అనుమానాలు కలగడం సహజం. అయితే.. పార్టీ ఇన్ పర్సన్(Party In Person)గా కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
పార్టీ ఇన్ పర్సన్‌గా.. ఒక కేసులో సొంతంగా వాదించుకునేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. పార్టీ ఇన్ పర్సన్‌గా ఉండాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజు.. ఇలా కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. ఒక అప్లికేషన్ సమర్పిస్తే.. మీకు ఆ అర్హత ఉందని భావిస్తే దానికి కోర్టు అనుమతిస్తుంది.
అయితే అవగాహన లేకున్నా సాధారణంగా అడ్వకేట్ల మీద నమ్మకం లేకనో, లేకుంటే అడ్వకేట్ల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి దరఖాస్తులు సమర్పించి కోర్టు అనుమతులతో వాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో.. చట్టాల గురించి తెలిసి ఉండి.. తమ కేసును తామే వాదించుకోగలమన్న నమ్మకం ఉన్నప్పుడు పార్టీ ఇన్ పర్సన్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. కేజ్రీవాల్ ఇప్పుడు అలానే దరఖాస్తు చేసుకుని.. ఆ అనుమతితో వాదించాలనుకున్నారు. కానీ, చివరకు పిటిషణ్ ఉపసంహరణతో అది జరగలేదు.
ఇదీ చదవండి: కేజ్రీవాల్ సీఎంగా కొనసాగొచ్చా?.. రాజ్యాంగం, చట్టం ఏం చెబుతోందంటే..
Comments
Please login to add a commentAdd a comment