
బైజూస్ రవీంద్రన్ (ఫైల్ ఫోటో)
సాక్షి,ముంబై: ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలతో బైజూస్ యజమాని రవీంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద జూలై 30 న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు.
బైజూస్ కంపెనీ యూపీఎస్‌సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్‌సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యుఎన్‌టీఓసీ)కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇ-మెయిల్ పంపామన్నారు. అయితే బైజూస్ సమాధానంపై సంతృప్తికంరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు.
మరోవైపు ఈ ఫిర్యాదుపై బైజూస్ స్పందించింది. ఎఫ్‌ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైందనని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన బహిరంగంగా అందుబాటులో ఉన్న 2012, ఏప్రిల్ 30 నాటి అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment