సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని రద్దు చేసిన సెక్షన్ 66ఏ కింద నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ సెక్షన్ కింద కొత్తగా ఎలాంటి కేసుల నమోదు చేయవద్దని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు అధిపతులను ఆదేశించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్ కింద దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు కావడంతో ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 1,307 కేసులు నమోదు అయితే.. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇలాంటి 229 కేసులు ఇంకా 11 రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్నాయని ఎన్జిఓ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఈ నెలలో కోర్టుకు తెలియజేసింది. ఈ నిబంధన రద్దు చేసిన తర్వాత రాష్ట్రాల్లోని పోలీసులు దాని కింద ఎందుకు కొత్త కేసులను నమోదు చేశారు. "ఏం జరుగుతోంది? ఇది భయంకరమైనది, బాధాకరం" అని జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 5న వ్యాఖ్యానించింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్(ఎఫ్ఐఆర్)లో చట్టంలోని సెక్షన్ 66ఏను పోలీసులు నిలివేసినట్లు తెలియజేయాలని బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఏ అంటే ఏమిటి?
భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలొ వ్యాపార లావాదేవీలను, ఈ-కామర్స్‌ను నియంత్రించడానికి ఐటీ చట్టాన్ని అమలులొకి తీసుకొచ్చింది. 2008లో ఈ చట్టాన్ని సవరించి సెక్షన్ 66ఏను చేర్చారు. ఐ.టి. చట్టంలోని సెక్షన్-66ఏ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. కింద పేర్కొన్న సందర్భాలలో సెక్షన్-66ఏ కింద అరెస్టు చేసే అవకాశం ఉంది.
- కంప్యూటర్, ఇతర సమాచార పరికరాన్ని గానీ ఉపయోగించి ఇతరులకు హానికర, అభ్యంతరకర సమాచారాన్ని చేరవేసిన.
- ఒక సమాచారం తప్పు అని తెలిసినప్పటికీ ఇతరులకు రాజకీయ, మత, ప్రాంత విద్వేషాలు పరంగా కోపం/ అసౌకర్యం/ ప్రమాదం/ కలిగించే నేరపూరిత ఉద్దేశంతో, శతృత్వంతో, ద్వేష భావంతో, దురుద్దేశంతో కంప్యూటర్ ద్వారా దానిని వినియోగించుకున్నా
- ఇతరులకు అసౌకర్యం కలిగించేలా, లేదా తప్పుదారి పట్టించేలా ఏదైనా ఈ-మెయిల్‌ను వాడుకున్నా, అసలు సందేశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా ఏమార్చాలని చూసిన.
ఒక సమాచారాన్ని రూపొందించినా, వేరేవారికి చేరవేసినా, ఇతరుల నుంచి స్వీకరించినా నేరమే. ముద్రణ రూప సమాచారం, చిత్రాలు, ధ్వని, దృశ్యాలు, ఇతర ఎలక్ట్రానిక్ సమాచారం విషయాల్లో ఇది వర్తిస్తుంది. ఈ చట్టాన్ని 2008లో సవరించారు. 2009 ఫిబ్రవరి 5న దీనిని రాష్ట్రపతి ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment