Chandrayaan-3 Mission To Be Launched On July 14 From Sriharikota, ISRO Announces - Sakshi
Sakshi News home page

Chandrayaan 3 Mission Details: చంద్రయాన్‌–3.. త్రీ ఇన్‌ వన్‌

Published Mon, Jul 10 2023 4:40 AM | Last Updated on Mon, Jul 10 2023 8:50 AM

Chandrayaan-3 mission to be launched on July 14, announces ISRO - Sakshi

సూళ్లూరుపేట:  చందమామ గురించి తెలుసుకోవడానికి గత 60 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా 1958 నుంచి చంద్రుడిపై పరిశోధనలు సాగిస్తోంది. 1969లో అపోలో రాకెట్‌ ద్వారా ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించింది. రష్యా, జపాన్, చైనా, ఇజ్రాయెల్, జర్మనీ, భారత్‌ తదితర దేశాలు చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాయి.

భారత్‌ 2008లో చంద్రుడి మీదికి చంద్రయాన్‌–1 పేరుతో ఆర్బిటార్‌ను ప్రయోగించింది. అక్కడ నీటి జాడలున్నాయని గుర్తించింది. చంద్రుడిపై రెండు ప్రయోగాలు చేసిన భారత్‌ మూడో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. సైంటిస్టులు ఏర్పాట్లను దాదాపు పూర్తిచేశారు. చంద్రయాన్‌–1, చంద్రయాన్‌–2 ప్రయోగాల వల్ల ఆర్బిటార్‌ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్‌ ద్వారా రోవర్‌ను పంపించిన నాలుగో దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. చంద్రయాన్‌–3లో మూడింటినీ ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్‌ వన్‌ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 అక్టోబర్‌ 22న చేపట్టిన చంద్రయాన్‌–1 ప్రయోగం విజయవంతమైంది. 2019 జూలై 15న చంద్రయాన్‌–2కు శ్రీకారం చుట్టింది. ఆర్బిటార్‌ ద్వారా ల్యాండర్, ల్యాండర్‌ ద్వారా రోవర్‌ను పంపించడమే కాకుండా 14 రకాల పేలోడ్స్‌ను పంపించారు. ప్రయోగమంతా సక్సెస్‌ అయిందనుకున్న తరుణంలో ఆఖరు రెండు నిమిషాల్లో ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టడంతో సంకేతాలు ఆగిపోయాయి.

దాంతో ఆ ప్రయోగం పాక్షిక విజయం మాత్రమే సాధించింది. దాదాపు నాలుగు సంవత్సరాలు తరువాత చంద్రయాన్‌–3 పేరుతో మూడోసారి ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14వ తేదీన ఈ ప్రయోగం చేపట్టనుంది. చంద్రయాన్‌–3లో ప్రపొల్షన్‌ మాడ్యూల్‌లో రెండు పేలోడ్స్, ల్యాండర్‌లో 4 పేలోడ్స్, రోవర్‌లో రెండు పేలోడ్స్, అమెరికాకు చెందిన ఒక పేలోడ్‌ను అమర్చి పంపించనున్నారు.  

రూ.1,600 కోట్ల వ్యయం
► చంద్రయాన్‌ ప్రాజెక్టులో భాగంగా మూడు ప్రయోగాలకు సుమారు రూ.1,600 కోట్లు వ్యయం చేస్తున్నారు.  
► చంద్రయాన్‌–3 ద్వారా చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడమే కాకుండా వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం ప్రారంభమయ్యే అవకాశం వుంది.  
► చంద్రయాన్‌–1 ప్రయోగానికి రూ.380 కోట్లు ఖర్చు చేశారు.  
► చంద్రయాన్‌–2 ప్రాజెక్టును రూ.425 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పదేళ్లు సమయం పట్టడంతో ఖర్చు అదనంగా రూ.173 కోట్లు పెరిగింది. అంటే చంద్రయాన్‌–2కు రూ.598 కోట్లు వ్యయం చేశారు.  
► చంద్రయాన్‌–3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్లు వెచ్చిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement