Chennai Auto Wala Story In Telugu: ఫ్రిజ్‌, టీవీ, ఐపాడ్‌, మాస్క్: ఆటోనా.. హైటెక్‌ హోటలా? - Sakshi
Sakshi News home page

ఫ్రిజ్‌, టీవీ, ఐపాడ్‌, మాస్క్: ఆటోనా.. హైటెక్‌ హోటలా?

Published Tue, Jul 20 2021 1:56 PM | Last Updated on Tue, Jul 20 2021 3:13 PM

Chennai Autowala Has IPad TV Snacks All in His Vehicle - Sakshi

చెన్నై: మనలో అందరికి చాలా ఆశలు, కోరికలుంటాయి. కానీ కొందరు మాత్రమే తన వాటిని తమ కలలను సాకారం చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సరే వాటిని అధిగమించి.. తాము అనుకున్నది సాధిస్తారు. సాధించాలనే సంకల్పం, గట్టి పట్టుడదల ఉంటే చాలు.. మిగతా సమస్యలన్ని దూది పింజల్లా తేలిపోతాయి. ఈ మాటలకు ఆకారం వస్తే.. అతడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటోవాలా అన్నా దురైలా ఉంటాడు.

పారిశ్రామికవేత్త కావాలనేది అన్నాదురై చిన్ననాటి కోరిక. కానీ దానికి తగ్గ డబ్బు, చదువు అతడి వద్ద లేదు. అయితే ఇవేవి అతడిని అడ్డుకోలేకపోయాయి. తన దగ్గరున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు. దానిలో ఎక్కే కస్టమర్లను ఆకర్షించడం కోసం అతడు ఎంచుకున్న మార్గం.. ఇప్పుడతన్ని ప్రత్యేకంగా, వార్తల్లో నిలిచే వ్యక్తిగా మార్చింది. అన్నాదురైకి సంబంధించిన కథనాన్ని హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

తమిళనాడు, చెన్నైకి చెందిన అన్నాదురై ఆర్థిక ఇబ్బందులు వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ పారిశ్రామికవేత్త కావాలనేది అతడి కోరిక. అయితే కుటుంబ పరిస్థితులు దృష్ట్యా ఆటో నడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ పారిశ్రామికవేత్త కావాలనే అతడి కోరిక మాత్రం తనని నిద్రపోనివ్వలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతడికి తట్టిన ఓ వినూత్న ఐడియా అన్నాదురై జీవితాన్ని మార్చేసింది. 

తాను నడుపుతున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు అన్నాదురై. ఇక తన ఆటోలోకి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ప్రస్తుతం కోవిడ్‌ విజృంభిస్తుంది. కనుక జనాలు ఆటోల్లో తిరగాలంటే భద్రత ముఖ్యం.. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరేవరకు వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌ కల్పించడం ముఖ్యం అనుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రణాళిక రచించాడు అన్నాదురై. 

దాని ప్రకారం తన ఆటోలో మాస్క్‌, శానిటైజర్‌ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఓ ఐపాడ్‌, టీవీ, చిన్న ఫ్రిజ్‌ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వారికి అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నిజంగానే మతి పోతుంది. తాము ఆటో ఎక్కామా లేక.. ఏదైనా స్టార్‌ హోటల్‌లో ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. ఈ వినూత్న ఆలోచనే అతడి జీవితాన్ని మార్చేసింది.

ఇక అన్నాదురై 9 భాషల్లో తన కస్టమర్లను పలకరిస్తాడు. వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇన్ని హైటెక్‌ హంగులతోపాటు.. కస్టమర్లను దైవంగా భావిస్తున్న అన్నాదురై ఆటో అంటే ఆ ప్రాంతంలో స్పెషల్‌ క్రేజ్‌ ఏర్పడింది. ఒక్కసారి అతడి ఆటో ఎక్కిన వారు.. మళ్లీ మళ్లీ దానిలోనే ప్రయాణం చేయాలని కోరుకుంటారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబేలో జూల్‌ 15న పోస్ట్‌ చేసిన అన్నాదురై స్టోరీ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 1.3 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దీన్ని వీక్షించారు. అన్నాదురై వినూత్న ఆలోచనపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement