సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్త పర్యటనను త్వరలో ప్రారంభించి చురుకైన రాజకీయాల్లో దిగుతున్నట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి విడుదలైన శశికళను ఇంకా పలు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కేసు, విదేశీ మారకద్రవ్యం, కొడనాడు ఎస్టేట్, బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అధికారులకు రూ.2 కోట్ల లంచం కేసుల విచారణలో ఆమె తలమునకలై ఉన్నారు.
ఈ కేసుల నుంచి విముక్తి, అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం కోసం ఆమె గత కొంతకాలంగా ఆధ్యాత్మిక పర్యటనలు సాగిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి తిరుచ్చిరాపల్లికి ప్రయాణం అవుతూ విమానాశ్రయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనల్లో ఉన్నానని వెల్లడించారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే క్రీయాశీలక రాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి పదవులపై త్వరలో అప్పీలు చేస్తానని స్పష్టం చేశారు.
కొడనాడు హత్య, దోపిడీ నేర ఘటనలపై ఎవైనా అనుమానాలు ఉన్నాయా ని మీడియా ప్రశ్నించగా బదులివ్వకుండానే వెళ్లిపోయారు. అనంతరం తిరుచ్చి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ రణక్షేత్రంలో ఒంటరిగా దిగుతారా..? పార్టీలతో పొత్తపెట్టుకుంటారా అని ప్రశ్నించగా మీరంతా ఇక్కడే కదా ఉంటారు, వేచి చూడండి అంటూ బదులిచ్చారు. మీకు స్వాగతం చెప్పేవారిని టీటీవీ దినకరన్ బహిష్కరిస్తారని ప్రచారం జరుగుతున్నదని ప్రశ్నించగా, ప్రస్తుతం ఆలయానికి వెళుతున్నా, తరువాత బదులిస్తానంటూ వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment