న్యూఢిల్లీ: దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత చైనాకు మన బియ్యం ఎగుమతి కాబోతున్నాయి. గతంలో సరఫరాను కఠినతరం చేయడంతో భారత్ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడం చైనాకు సాధ్యపడలేదు. అయితే ప్రస్తుతం భారత్ భారీ డిస్కౌంట్ రేట్లు ఆఫర్ చేయడంతో బియ్యం దిగుమతి చేసుకునేందుకు చైనా ముందుకు వచ్చింది. ఇక ప్రపంచంలో బియ్యం ఎగుమతిలో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా... దిగుమతిలో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. డ్రాగన్ ప్రతి ఏడాది వేర్వేరు దేశాల నుంచి 4 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. కానీ వీటిలో ఇండియా లేదు. మన బియ్యం నాణ్యత సరిగా ఉండదనే కారణంతో భారత్ బియ్యం పట్ల చైనా ఆసక్తి చూపేది కాదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికి.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. (చదవండి: డ్రాగన్ శకం ముగిసింది!)
ఈ సందర్భంగా బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ క్రిష్ణా రావు మాట్లాడుతూ.. ‘చాలా కాలం తర్వాత మొదటి సారి చైనా మన బియ్యం దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది. నాణ్యత చూశాక వచ్చే ఏడాది నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటుందని భావిస్తున్నాం’ అన్నారు. ఇక డిసెంబరు-ఫిబ్రవరి మధ్యలో భారతీయ వ్యాపారులు టన్నుకు 300(మన కరెన్సీలో 22వేల రూపాయలు) అమెరికన్ డాలర్ల చొప్పున లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు చైనా థాయిలాండ్, వియత్నాం, మయాన్మార్, పాకిస్తాన్‌ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment