ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒక యువకుని మృతికి దారితీసింది. ఈ ఘటన నేపధ్యంలో మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (బీఎన్‌ఎస్‌స్)లోని సెక్షన్ 163 కింద జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు. ఖుర్దా పట్టణ శివార్లలోని ముకుంద్ ప్రసాద్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని, ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
ఈ ఘర్షణల్లో గాయపడిన వ్యక్తిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిశీలించి, అతను మృతిచెందినట్లు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య జరిగిన హింసాకాండలో పలు వాహనాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎస్.కె. ప్రియదర్శి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
ఈ హత్య అనంతరం స్థానికులు రోడ్డుపై బైఠాయించి వీరంగం సృష్టించారని పోలీసు సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ మీడియాకు తెలిపారు. అయితే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనం అక్కడినుంచి వెళ్లిపోయారన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ చంచల్ రాణా మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఘర్షణల దరిమిలా ఖుర్దా మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో తక్షణమే నిషేధాజ్ఞలు విధించినట్లు ఆయన చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వాణిజ్య సంస్థలు మూతపడనున్నాయి. అయితే అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment