ఉక్రెయిన్‌లో కర్ణాటక విద్యార్థులు.. సీఎం ఏమన్నారంటే!  | CM Bommai Says In Touch With MEA About Karnataka students In Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో కర్ణాటక విద్యార్థులు.. సీఎం ఏమన్నారంటే! 

Published Fri, Feb 25 2022 8:35 AM | Last Updated on Fri, Feb 25 2022 9:47 AM

CM Bommai Says In Touch With MEA About Karnataka students In Ukraine - Sakshi

సాక్షి బెంగళూరు: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్నత చదువులకు వెళ్లిన తమ పిల్లలు ఎలా ఉన్నారో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల భద్రత, క్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మరో వైపు ఇండియా వచ్చేందుకు అన్నీ సిద్ధం చేసుకోగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో స్వదేశానికి ఎలా రావాలో తెలియక విద్యార్థులు సతమతమవుతున్నారు. కాగా, కర్ణాటక వాసుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించినట్లు తెలిపారు. 

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. దావణగెరెలోని భగత్‌సింగ్‌ నగర నివాసి షౌకత్‌ అలీ కుమారుడు అబీద్, చిక్కమగళూరు తాలూకా ఆల్దూరు హోసళ్లి ఇంద్రేశ్‌ కుమారుడు ప్రద్వీన్‌లు మెడిసిన్‌ చదువుతున్నారు. బెళగావి జిల్లా రాయబాగ తాలూకా కంకణవాడి గ్రామానికి చెందిన ప్రియా భగవంత నిడగుంది, గోకాక్‌ తాలూకా ఘటప్రభ నివాసి అమోఘ చౌగలె, బాగలకోటె జిల్లా విద్యాగిరికి చెందిన మనోజ్‌ కుమార్‌ చిత్రగార, అపూర్వలు తాము క్షేమంగా ఉన్నట్లు  సమాచారం ఇచ్చారు. కొప్పళ జిల్లాకు చెందిన విద్యార్థి,  యలబుర్గా తాలూకా కల్లూరకి చెందిన సంగమేశ్, కలబురిగికి చెందిన జీవితలు ఉన్నత విద్య చదువుతున్నారు. రామనగర జిల్లాకు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు.

చెన్నపట్టణ తాలూకా తిమ్మసంద్రకు చెందిన నివేదిత, రామనగర ఐజూరు గ్రామానికి చెందిన ఆయేషాలు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. మాజీ సీఎం కుమారస్వామి నివేదితతో మాట్లాడి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. మంగళూరుకు చెందిన వైద్య విద్యార్థి క్లాటన్‌ తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడింది. హుబ్లీ జిల్లా కుందగోళ తాలూకా యరగుప్పి గ్రామానికి యువతి చైత్ర, శివమొగ్గకు చెందిన  ఒకరు, శివమొగ్గ తాలూచా సంతెకడూరు గ్రామానికి చెందిన తేజస్, హావేరి జిల్లాకు చెందిన  8 మంది, రాణిబెన్నూరు తాలూకాకు చెందిన ఏడుగురు, బ్యాడగి తాలూకాకు చెందిన మరొకరు, విజయపుర జిల్లా తాళికోటెకు చెందిన సుచిత్ర ఉక్రెయిన్‌లో ఉన్నారు.   

ధైర్యంగా ఉండండి : మంత్రి శ్రీరాములు
బళ్లారి : ఉక్రెయిన్‌లో ఉంటున్న బళ్లారి జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్థులతో మంత్రి శ్రీరాములు మాట్లాడారు. గురువారం రాత్రి ఆయన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. బళ్లారి, సింధనూరుకు చెందిన విద్యార్థులతో వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ముందుగా ఆహారం నిల్వ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయన విదేశాంగ శాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాలు శాఖ మంత్రులతో మాట్లాడి విద్యార్థులను సురక్షితంగా భారత్‌కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు.   

ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులతో వీడియో కాల్‌లో
మాట్లాడుతున్న మంత్రి శ్రీరాములు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement