న్యూఢిల్లీ: కరోనా మూలంగా తలెత్తిన సంక్షోభం, లాక్‌డౌన్ మూలంగా కాలేజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపైనే అందరికంటే ఎక్కువగా ప్రభావం పడిందని ఓ సర్వే తేల్చింది. ఆన్‌లైన్ మానసిక ఆరోగ్య వేదిక ‘యువర్‌దోస్త్’ఎనిమిది వేల మందితో రెండు విడతలుగా సర్వే నిర్వహించింది. మొదట లాక్‌డౌన్ ప్రారంభంలో, రెండోసారి జూన్‌లో సమాజంలోని వివిధ వర్గాల మానసిక పరిస్థితిని ఈ సర్వే విశ్లేషించింది.
లాక్‌డౌన్ ముందుకుసాగిన కొద్దీ... కాలేజీ విద్యార్థుల్లో భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. కోపం, అసహనం, ఆందోళన, ఒంటరితనం ఫీలవ్వడం, నిరాశానిస్పృహల్లో కూరుకుపోవడం అధికమైంది. ఆందోళన, భయం 41 శాతం ఎక్కువైంది. విద్యార్థినీ విద్యార్థుల్లో సాధారణ పరిస్థితులతో పోలిస్తే... కోపం, అసహనం, చికాకు 54 శాతం ఎక్కువయ్యాయి. నిరాశకు లోనుకావడం 27 శాతం, విచారంలో మునిగిపోవడం 17 శాతం, ఒంటరితనం, బోర్‌గా ఫీలవ్వడం 38 శాతం పెరిగాయి. ఇంటికి మాత్రమే పరిమితమైపోవడం విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
స్వేచ్ఛను కోల్పోయామనే భావన
కాలేజీ లేదు. స్నేహితులతో పిచ్చాపాటి, క్యాంపస్‌లో సరదాలు... ఏవీ లేవు. రోజంతా ఇంట్లోనే ఉండాల్సి రావడం కూడా వారికి ఇబ్బందిగా మారింది. అన్నివేళలా తల్లిదండ్రులు కూడా ఉండటంతో స్వేచ్ఛను కోల్పోయామని విద్యార్థులు పేర్కొన్నారు. ఇంట్లోనే ఉండటంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు.
తర్వాతేంటి?
కాలేజీ విద్యార్థుల తర్వాత ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం పడిందని సర్వే తేల్చింది. ఉద్యోగ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి, తర్వాత ఏంటి? అనే ప్రశ్న ఉద్యోగులను కుంగుబాటుకు గురిచేసింది. ఉద్యోగుల్లో భయాందోళనలు 41 శాతం పెరిగాయి. కోపం, అసహనం, చిరాకు 34 శాతం పెరిగాయి. నిరాశావాదం 17 శాతం, విచారపడటం 18 శాతం, ఒంటరితనం, బోర్‌గా ఫీలవ్వడం 26 శాతం పెరిగాయి.
దీర్ఘకాలం నలుగురితో కలవకపోవడం, ఇంటికే పరిమితం కావడం, జీవనశైలిలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ఉద్యోగులు ఇప్పటికీ వీటికి అలవాటుపడటానికి ఇబ్బందిపడుతున్నారు. అందరిలోనూ ఒత్తిడి పెరిగిపోయింది. లాక్‌డౌన్ ఆరంభంలో 33 శాతం మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పగా... జూన్‌లో ఇది మరో 7.55 శాతం పెరిగింది. నిద్రలేమితో బాధపడుతున్న వారు కూడా 11 శాతం వరకు పెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment