సాక్షి, ముంబై: బీడ్ జిల్లాలో కూడా రేపటి నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10 రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా నైట్ కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ కరోనా రోగుల సంఖ్య నియంత్రణలోకి రాకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీడ్ కలెక్టర్ మీడియాకు తెలిపారు. దీంతో జిల్లాలో అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ ఉంటాయన్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న నాందేడ్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. నాందేడ్ పట్టణంతోపాటు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మార్చి 25 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ విపిన్ ఇటన్కర్ మీడియాకు తెలిపారు. దీంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత నాందేడ్ జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయించారు. చదవండి: (ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్)
తెలంగాణకు రాకపోకలపై ప్రభావం..!
లాక్‌డౌన్‌లో భాగంగా నాందేడ్ జిల్లాల్లో రవాణ వ్యవస్థపై కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలపై ప్రభావం పడింది. జిల్లాలో ద్విచక్ర వాహనాలతోపాటు మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలపై నిషేధం విధించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులపై కూడా ఆంక్షలు విధించారు. అయితే నాందేడ్ జిల్లా కాకుండా ఇతర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆర్‌టీసీ బస్సులకు మాత్రం జిల్లా నుంచి వెళ్లేందుకు మినహాయింపు ఇచ్చారు.
అదేవిధంగా అత్యవసర సేవలందించే వాహనాలకు కూడా అనుమతులతో మినహాయింపు ఉన్నట్టు తెలిసింది. మరోవైపు నాందేడ్ జిల్లా మీదుగా ఇతర జిల్లాలు, తెలంగాణకు వెళ్లేవి, తెలంగాణకు వచ్చే ప్రైవేట్ బస్సులపై కూడా నిషేధం విధించినట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులను ఫోన్‌లో సంప్రదించగా జిల్లా సరిహద్దులను ఇంకా సీల్ చేయలేదని కానీ, పరిస్థితిని బట్టి పూర్తిగా సీల్ చేయనున్నట్టు తెలిపారు. చదవండి: (సీఎం సతీమణికి కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment