సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త రికార్డు స్థాయిలతో కరోనా వైరస్ పంజా విసురుతోంది. అటు పెరుగుతున్న మరణాల సంఖ్య కూడా ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 ఉదృతి కొనసాగుతోంది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి చెందిన ఏకంగా 37 మంది వైద్యులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 32 మంది ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా వ్యాక్సినేషన్ తొలిదశలో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడంతో మరింత ఆందోళన పుట్టిస్తోంది. (కరోనా ఉధృతి: ఒకేరోజు 780 మంది మృత్యువాత)
కాగా కరోనా శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కేరళ, పంజాబ్‌లతో పాటు 10 రాష్ట్రాలలో ఢిల్లీ కూడా ఉంది. దీంతో వైరస్ ఉధృతిని అడ్డుకునేందుకు ఢిల్లీలో ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో పాజిటివ్ కేసుల నమోదు మరో రికార్డును తాకింది. ఇటీవల రోజు వారీ కేసులలో లక్షమార్క్‌ను అధిగమించిన కేసులకు తోడు గత 24గంటల్లో మరో 1,31,968 కేసులు జత చేరడం గమనార్హం. అలాగే ఒకేరోజు 780 మంది మృత్యువాత పడటం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment