సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి మరోసారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గతేడాది కరోనా కారణంగా కుదేలైన పర్యాటక రంగం గాడిన పడుతుందనుకున్న సమయంలో, గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల్లో గణనీయ వృద్ధి కనిపించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఈ ప్రభావం ఈ ఏడాది జరుగబోయే చార్‌ధామ్ యాత్రపై పడింది. మే 14 న అక్షయ తృతీయ రోజున యమునోత్రి ధామ్, మే 15 న గంగోత్రి ధామ్ తెరుచుకున్న అనంతరం చార్‌ధామ్ యాత్ర అధికారికంగా భక్తుల కోసం ప్రారంభమౌతుంది.
అదే సమయంలో మే 17 న కేదార్‌నాథ్, మూడవ కేదార్ తుంగ్నాథ్, మే 18న బద్రీనాథ్ ధామ్ ద్వారా లు భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. దీంతో ఈసారైనా పర్యాటక రంగం గాడిన పడుతుందని భావించిన స్థానిక వ్యాపారులకు తాజా పరిస్థితులు మరో ఏడాది దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశాయి. ఇప్పటికే చార్‌ధామ్ యాత్రలో పాల్గొనాలనుకున్న భక్తులు, పర్యాటకులు గఢ్‌వాల్ మండల్ వికాస్ నిగమ్ (జిఎంవిఎన్) ఏర్పాటు చేసిన హోమ్ స్టే, హట్స్, కాటేజీలు, రెస్టారెంట్లకు సంబంధించిన బుకింగ్స్ ఒక్కటొక్కటిగా రద్దు చేసుకుంటున్నారు.
ఊగిసలాటలో భక్తులు
కేదర్‌ఘాటితో సహా ఇతర ప్రాంతాల్లో ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ మహమ్మారి వారి ఆశలను దెబ్బతీసింది. గఢ్‌వాల్ మండల్ వికాస్ నిగం వద్ద జరిగిన సుమారు మూడు కోట్ల బుకింగ్స్‌లో, గత ఒక వారంలో ఎనిమిది లక్షల బుకింగ్స్ రద్దు అయ్యాయి. అంతేగాక కేదర్‌ఘాటి, తుంగ్నాథ్ ఘాటి, మద్మాహేశ్వర్ ఘాటిల్లో హోమ్ స్టే ఆపరేటర్లకు చెందిన సుమారు రెండు లక్షల బుకింగ్‌లు సైతం రద్దు చేసుకున్నారు. వీటితోపాటు జీఎంవీఎన్ కార్యాలయానికి తమ బుకింగ్‌ను పోస్ట్‌పోన్ చేయాలనే భక్తుల మెయిల్స్ ప్రతీరోజు 15 నుంచి 20 వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బుకింగ్స్ ఒక్కటొక్కటిగా రద్దు అవుతున్నాయి. అయితే కరోనాకు సంబంధించి గత 15 రోజుల్లో తలెత్తిన పరిస్థితుల కారణంగా, చార్‌ధామ్ యాత్ర ప్రారంభంపై భక్తుల్లో సందేహాలు ఉన్నాయని గౌరికుండ్ ట్రేడ్ అసోసియేషన్ భావిస్తోంది.
విధివిధానాలు ప్రచురించండి
దేశంలో పెరుగుతున్న కోవిడ్–19 కేసులను దష్టిలో ఉంచుకొని చార్‌ధామ్ యాత్రకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలను వెంటనే ప్రకటించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చార్‌ధామ్ యాత్రను మరో కుంభ్‌మేళాలా మార్చేందుకు అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తూ ఆ ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment