న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ఈ మహమ్మారి సంక్రమణ ప్రారంభమైన నాటి నుంచి ఎన్నడూలేని విధంగా 24 గంటల్లోనే ఏకంగా 2 లక్షలకుపైగా కేసులతో కొత్త రికార్డు నమోదయింది. యాక్టివ్ కేసులు కూడా 1,40,74,564కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. దేశంలో 24 గంటల్లోనే 2,00,739 కేసులు కొత్తగా నిర్థారణ అయ్యాయి. మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల నమోదైందని కేంద్రం తెలిపింది. మొత్తం రోజువారీ కేసుల్లో ఈ 10 రాష్ట్రాల్లోనివే 80.76% వరకు ఉన్నాయని వెల్లడించింది. 24 గంటల్లో మహారాష్ట్రలో 58,952 కేసులు, ఉత్తరప్రదేశ్‌లో 20,439, ఢిల్లీలో 17,282 కేసులు వెలుగులోకి వచ్చాయి. వరసగా తొమ్మిదో రోజు కూడా లక్షకు పైగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో కేవలం 9 రోజుల్లోనే 13,88,515 కేసులు నమోదయ్యాయి.
అక్టోబర్ 3 తర్వాత అత్యధికం
24 గంటల్లో 1,038 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. రోజువారీ మరణాల్లో గత ఏడాది అక్టోబర్ 3వ తేదీ తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 278, ఛత్తీస్‌గఢ్‌లో 120, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 73, ఉత్తరప్రదేశ్‌లో 67, పంజాబ్‌లో 63, మధ్యప్రదేశ్‌లో 51, కర్ణాటకలో 38, జార్ఖండ్‌లో 31 చొప్పున మరణాలు సంభవించాయని వివరించింది. 24 గంటల్లో మరో 93,528 మంది వ్యాధి నుంచి బయటపడగా మహమ్మారి బారినపడి కోలుకున్న వారి సంఖ్య 1,24,29,564 కాగా రికవరీ రేటు 88.31%కి, మరణాల రేటు 1.23%కి పడిపోయినట్లు కేంద్రం పేర్కొంది. వీటితోపాటు, 36 రోజులుగా పెరుగుదల నమోదు చేసుకుంటున్న యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో గుర్తించిన 1,06,173 కేసులతో కలిపి 14,71,877కు చేరాయని, మొత్తం కేసుల్లో ఇవి 10.46% అని పేర్కొంది. మొత్తం యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, యూపీ, కేరళ రాష్ట్రాల్లోనివే 67.16% ఉన్నాయి. ఇప్పటి వరకు 26,20,03,415 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
కుంభమేళాలో 1,700 మందికి పాజిటివ్
హరిద్వార్‌లో కొనసాగుతున్న కుంభమేళాకు వచ్చే వారికి ఐదు రోజులుగా చేపడుతున్న కోవిడ్–19 పరీక్షల్లో 1,700మందికి పైగా పాజిటివ్‌గా నిర్థారణయింది. ఈ నెల 10–14 తేదీల మధ్య కుంభమేళాలో పాల్గొన్న భక్తులు, సాధువులు 2,36,751 మందికి ఆర్‌టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరపగా 1,701 మందికి పాజిటివ్‌గా తేలింది. పూర్తి ఫలితాలు వెల్లడైతే పాజి టివ్ కేసులు 2వేల వరకు చేరే అవకాశం ఉందని హరిద్వార్ ప్రధాన వైద్యాధికారి శంభుకుమార్ ఝా వెల్లడించారు. కుంభమేళాలో∙48.51లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు అంచనాలున్నాయి.
మే 15 వరకు చారిత్రక కట్టడాలు, మ్యూజియాలు మూసివేత
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించే చర్యలను వేగవంతం చేసింది ఇందులో భాగంగా భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ ఆధీనంలో ఉండే చారిత్రక కట్టడాలతో పాటు మ్యూజియంలను మే 15 వరకు లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ మూసి వేయాలని పురావస్తు శాఖ డైరెక్టర్ ఎన్.కె.పాఠక్ ఉత్తర్వులు జారీ చేశారు.
‘టీకా ఉత్సవ్’లో 1,28,98,314 డోసులు
దేశంలో అర్హులైన వారందరికీ కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 14వ తేదీ దాకా ప్రత్యేకంగా ‘టీకా ఉత్సవ్’ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల్లో మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రంలో కోటికి పైగా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ నెల 11న 29.33 లక్షలు, 12న 40.04 లక్షలు, 13న 26.46 లక్షలు, 14న 33.13 లక్షల టీకా డోసులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. టీకా ఉత్సవ్‌లో మొత్తం 1,28,98,314 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు తెలిపింది. మహారాష్ట్రలో 1.11 కోట్లు, రాజస్తాన్‌లో 1.02 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 1.00 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొంది. నాలుగు రోజులపాటు పని ప్రదేశాల్లోనే అర్హులకు టీకాలు అందజేసినట్లు గుర్తుచేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కర్మాగారాలు, పరిశ్రమల్లో కోట్లాది మంది టీకాలు తీసుకున్నారని వివరించింది.
కరోనా కల్లోలం: ఒక్కరోజే రెండు లక్షల కేసులు
Published Fri, Apr 16 2021 3:40 AM | Last Updated on Fri, Apr 16 2021 12:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment