న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణ కోసం అయిదు రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పత్రాలను సమర్పించింది. కవిత రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు పలు సంచలన విషయాలు పొందుపర్చారు. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు అభియోగం మోపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది.
ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని రిపోర్టు రిపోర్టులో వెల్లడించింది.
మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనని అన్నారు శరత్. మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు పేర్కొంది.
చదవండి: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు
ఒక్కో రిటైల్ జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కు కవితే రూ.100కోట్లు చెల్లించారని చెప్పింది.
ఇండోస్పిరిట్లో కవిత 65 శాతం వాటా పొందారని, గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. ఈ డబ్బును కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని, ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలిపింది. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును కోరింది సీబీఐ.
కాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో గతంలోనూ సీబీఐ ఆమెను హైదరాబాద్‌లో ఆమెనుప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచింది.
విచారణ నిమిత్తం కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. మరోవైపు సీబీఐ ప్రశ్నించడం, అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment