మద్యం వ్యాపారి శరత్ నుంచి రూ.59.5 కోట్ల బాండ్లు
బీజేపీ చీఫ్ నడ్డాను ఈడీ తక్షణం అరెస్టు చేయాలి: ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం తాలూకు ముడుపులు ఎన్నికల బాండ్ల రూపంలో మద్యం వ్యాపారుల నుంచి నేరుగా బీజేపీకే అందాయని ఆప్ నేతలు, ఢిల్లీ మంత్రులు ఆతిషి, సౌరభ్ భరద్వాజ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదంతంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈడీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా ఆప్ నేతల నుంచి గానీ, మంత్రుల నుంచి గానీ రూపాయి కూడా రికవరీ కాలేదు.
మద్యం దుకాణాలు దక్కించుకున్న శరత్‌చంద్ర రెడ్డి వాగ్మూలం ఆధారంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. కేజ్రీవాల్‌ను తానెన్నడూ కలవలేదని, మాట్లాడలేదని, ఆప్‌తో ఏ సంబంధమూ లేదని విచారణలో చెప్పిన మర్నాడే శరత్‌ను ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్‌ను కలిసి మద్యం కుంభకోణంపై మాట్లాడానంటూ మాట మార్చగానే బెయిల్ పొందారు!’’ అని ఆరోపించారు. ‘‘శరత్ కంపెనీల ద్వారా బీజేపీకి ఎన్నికల బాండ్ల రూపంలో రూ.4.5 కోట్లు అందాయి. అరెస్టు అనంతరం బీజేపీకి ఆయన ఏకంగా మరో రూ.55 కోట్ల ఎన్నికల బాండ్లు ఇచ్చారు’’ అంటూ సంబంధిత వివరాలను మీడియాకు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment