దేశంలో ఎన్నో నగరాలున్నా చెన్నై మహానగరం అంటే ప్రజలకు, పర్యాటకులకు ఎంతో ప్రీతి. మరి ఈ మహానగరాన్ని చుట్టివచ్చేందుకు ఎంతో వ్యయ, ప్రయాసలొద్దు కేవలం రెండున్నర గంటలు చాలు అంటోంది మెట్రో యాజమాన్యం. చెన్నైలోని నలుదిశలను కలుపుతూ 118.9 కిలోమీటర్ల దూరానికి మెట్రో రైల్వే రింగ్ ట్రాక్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 2026 నాటికి సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు మీడియాకు తెలిపారు.
సాక్షి, చెన్నై: చెన్నై నగరంలో రెండు మార్గాల మెట్రో రైలు సేవలు సుమారు 55 కిలో మీటర్ల వరకు కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రెండో దశలో మూడవ ట్రాక్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గత ఏడాది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. రూ.69 వేల కోట్ల అంచనాతో 128 రైల్వేస్టేషన్ల నిర్మాణానికి సంబంధించి తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. మూడు, నాలుగు, ఐదు ట్రాక్‌ల నిర్మాణానికి ప్రారంభ పనులు జరుగుతున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న ఈ మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తే 2.30 గంటల సమయంలో చెన్నై మహానగరం ఉత్తరం నుంచి దక్షిణం వరకు చుట్టి రావచ్చు. మాధవరం నుంచి షోళింగనల్లూరు వరకు, తూర్పు దిశలోని అడయారు మీదుగా చెన్నైలోని ఉత్తర భాగాన ఉన్న కోయంబేడు వరకు 81 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్‌లను నిర్మించనున్నారు.
రింగ్ ట్రాక్ మార్గంలో మూడు, ఐదు ట్రాక్‌లైన్‌లను అనుసంధానం చేస్తూ సెంట్రల్ మెట్రో రైల్వేస్టేషన్‌ను కోయంబేడు మీదుగా చెన్నై మీనంబాక్కం ఎయిర్ పోర్టు రైల్వేస్టేషన్‌ను కలిపేలా ఒకటి, రెండు ట్రాక్‌లను అనుసంధానం చేస్తారు. 118.9 కిలోమీటర్ల ఈ రైలు మార్గం రెండో దశ పనులు 2026 నాటికి అందుబాటులోకి వస్తాయి అని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రింగ్ ట్రాక్ మాధవరంలో ప్రారంభమై కోయంబేడు, షోళింగనల్లూరు, అడయారు మీదుగా మళ్లీ మాధవరం వరకు చేరుకుంటుంది. గంటకు ఏడు రైళ్ల చొప్పున ప్రతి 8.5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి వస్తుంది. ఐదవ ట్రాక్‌లో పెరుంబాక్కం నుంచి మూడవ ట్రాక్‌లో ఉన్న పెరంబూరుకు లేదా మూడవ ట్రాక్‌లోని తరమనై నుంచి ఐదవ ట్రాక్‌లోకి మారి రింగ్ ట్రాక్‌లో ప్రయాణించవచ్చు. ఈ రింగ్ ట్రాక్‌లో ని రైళ్లు పోరూరు జంక్షన్ నుంచి పెరుంగుడి లేదా కారపాక్కం, ఓఎంఆర్ రోడ్డులోని రైల్వేస్టేషన్‌కు ఒకే రైల్లో ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
తద్వారా ప్రయాణికులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. రెండవ ట్రాక్‌లో విస్తరణ పనుల ప్రణాళిక ప్రకారం మూడో ట్రాక్ ద్వారా మాధవరం నుంచి మాధవరం బస్ టెర్మినల్ వరకు 5,171 మంది ప్రయాణికులు, మాధవరం బస్ టెర్మినల్ నుంచి ఐదవ ట్రాక్‌లోని షోళింగనల్లూరు వరకు 35,714 మంది ప్రయాణించగలరని అంచనావేశారు. కొత్తగా నిర్మించే మూడో మార్గంలో కూడా వేరు వేరుగా రైళ్లను నడుపుతారు. ఇందువల్ల 2055 నాటికి మాధవరం, షోళినంగనల్లూరు నుంచి 3.5 నిమిషాలకు ఒక రైలు నడపగల సామర్థ్యం సమకూరుతుంది. ఈ మార్గాల్లో సుమారు 3 బోగీలు గలిగిన 21 రైళ్లు, 2025 నాటికి 6 బోగీలు కలిగిన 15 రైళ్లు, అలాగే 6 బోగీలు కలిగిన 37 రైళ్లను నడపాలని తీర్మానించుకున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment