సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు కష్టాల నుంచి విముక్తి కలిగించి, రానున్న కాలంలో రైతే రాజు అనేలా వ్యవసాయాన్ని తీర్చిదిద్దుతాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ బిల్లులు రైతుకు నిజమైన స్వాతంత్య్రం తెచ్చాయన్నారు. వీటితో తన అక్రమ ఆదాయానికి కోత పడుతుందనే సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ బిల్లులను తెస్తామని మేని ఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు రభస చేస్తోందని మండిపడ్డారు. సహచర ఎంపీ సోయం బాపూరావుతో కలసి సోమవారం ఢిల్లీలో విలేకరులతో అరవింద్ మాట్లాడారు.
పంట అమ్మిన రోజే రైతు చేతికి సొమ్ము..
‘స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయిన కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొత్త చట్టాల ద్వారా రైతులు తమ పంటను, తమకు నచ్చిన మార్కెట్లో ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ము కోవచ్చు. రవాణా ఖర్చుల భారం వారిపై పడదు. పంట నాణ్యత తనిఖీ బాధ్యత వ్యాపారిదే. రైతుకు రావాల్సిన సొమ్ము కూడా పంట అమ్మిన రోజే అతని ఖాతాలో చేరుతుంది. ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో అమ్మిన పంటకు రావాల్సిన సొమ్ము రైతుకు 15–20 రోజుల తర్వాత చేతికందుతోంది. వెంటనే డబ్బు కావాలంటే 2 శాతం వడ్డీ కట్టుకుని చెల్లిస్తున్నారు. కొత్త చట్టాలతో రైతు.. ఏజెంటుకు 2 శాతం కమీషన్, మార్కెట్ యార్డుకు 1 శాతం ఫీజు, 2 శాతం వడ్డీ చెల్లించడం తప్పుతాయి. దానితో రైతుకు కనీసం 5 శాతం డబ్బు ఆదా అవుతుంది’ అని అరవింద్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment