డిజిటల్ మీడియా నియంత్రణకు చట్టం! | Digital News to be Regulated and Can Face Action in India | Sakshi
Sakshi News home page

డిజిటల్ మీడియా నియంత్రణకు చట్టం!

Published Fri, Jul 15 2022 7:57 PM | Last Updated on Fri, Jul 15 2022 8:23 PM

Digital News to be Regulated and Can Face Action in India - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు సన్నద్దమవుతోంది. దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లును వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదిస్తే డిజిటల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే వెబ్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడం, జరిమానా విధించేందుకు అవకాశం కలుగుతుంది.

న్యూస్‌ ప్రొవైడర్లపై ఆంక్షలు..
ఇప్పటివరకు ఏ ప్రభుత్వ శాఖ నియంత్రణ పరిధిలోని డిజిటల్‌ న్యూస్‌ను తొలిసారిగా మీడియా నమోదు చట్టంలోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేష‌న్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడిక‌ల్స్ బిల్లులో కొత్తగా ‘ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా డిజిటల్ మీడియాలో వార్తలు’ అనే అంశాన్ని చేర్చింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే డిజిటల్‌ న్యూస్‌ ప్రొవైడర్లకు ఆంక్షలు తప్పవు. చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజుల్లోపు.. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తమ వెబ్‌సైట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

అప్పీలేట్ బోర్డు కూడా..
నిబంధనలు అతిక్రమించిన డిజిటల్ న్యూస్ పబ్లిషర్లపై చర్యలు తీసుకునే అధికారం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్‌కు ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించిన వెబ్‌సైట్ల రిజిస్ట్రేషన్‌లను నిలిపివేయడం లేదా రద్దు చేయడంతో పాటు జరిమానాలు విధించే చర్యలు ఉంటాయి. ఈ బిల్లును ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌ నేతృత్వంలో అప్పీలేట్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు అధికారిక వర్గాల సమాచారం.

సమాచార శాఖ పరిధిలోకి డిజిటల్‌ న్యూస్‌
మీడియా నమోదు చట్టంలో కేంద్రం ప్రతిపాదిత తాజా సవరణలు అమల్లోకి వస్తే... డిజిటల్‌ న్యూస్‌ మీడియా పూర్తిగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రణలోకి వస్తుంది. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం డిజిటల్ మీడియాను నియంత్రించేందుకు 2019లో చేసిన ప్రయత్నం పెద్ద వివాదానికి దారితీసింది. డిజిటల్‌ మీడియా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో అప్పట్లో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ‘ఏదైనా ఎల‌క్ట్రానిక్ పరికరం నుంచి ఇంట‌ర్నెట్ ద్వారా టెక్ట్స్‌,  వీడియో, ఆడియో, గ్రాఫిక్స్‌ రూపంలో, డిజిట‌ల్ ఫార్మాట్‌లో వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డాన్ని డిజిట‌ల్ మీడియా న్యూస్‌’గా అప్పట్లో నిర్వ‌చించారు. (క్లిక్: సహజీవనం చేసి.. రేప్‌ కేసులు పెడితే ఎలా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement