మనిషి తర్వాత అత్యంత తెలివైన జీవుల జాబితాలో డాల్ఫిన్లు అగ్ర స్థానంలో ఉంటాయన్నది తెలిసిందే. మన సైగలను ఇట్టే అర్థం చేసుకోవడంలో, తదనుగుణంగా స్పందించడంలో వాటికవే సాటి. అయితే, సహచరులతో కలిసి సరదాగా ఆడుకునేటప్పుడు అవి నోరంతా తెరిచి నవ్వుతాయి కూడానట! కొన్నేళ్లపాటు లోతుగా పరిశోధనలు చేసి మరీ సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు.
ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పీసా పరిశోధకులతో కూడిన బృందం డాల్ఫిన్లు హావభావాలపై అధ్యయనం చేసింది. అవి బృందంగా ఏర్పడి ఆటలాడుకుంటున్న, శిక్షకులతో కలసి ఆడతున్న 80 గంటలకు పైగా ఫుటేజీని లోతుగా పరిశీలించింది. మనుషులతో ఆడేటప్పుడు మామూలుగానే ఉంటున్నా, తోటి నేస్తాలతో ఆడుకుంటున్నప్పుడు మాత్రం అవి తరచూ నోరంతా తెరిచి చక్కగా నవ్వుతున్నట్టు తేల్చారు. ఈ నవ్వుల్లో ఏకంగా 89 శాతం తన జట్టు సభ్యుడు దృష్టి పథంలోకి వచ్చినప్పుడే చోటుచేసుకుంటున్నాయట.
ఆ వెంటనే సదరు సభ్యులు కూడా చిరునవ్వుతో ప్రతిస్పందిస్తున్నాయట. అంతేకాదు, అవతలి వారి ముఖకవళికలను అచ్చుగుద్దినట్టుగా అనుకరిస్తూ ఆటపట్టిస్తున్నాయట కూడా. డాల్ఫిన్లులో ఈ రెండు లక్షణాలను ఇంతకు ముందెప్పుడూ గుర్తించలేదని అధ్యయన బృంద సారథి ఎలిజబెటా పలాగీ వివరించారు. నవ్వు మనుషులకు మాత్రమే పరిమితమని ఇంతకాలంగా ఉన్న భావన తప్పని డాల్ఫిన్లు నిరూపించాయని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయన ఫలితాలను సెల్ ప్రెస్ జర్నల్‌లో ప్రచురించారు.
– రోమ్
Comments
Please login to add a commentAdd a comment