సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌పై మరీ భయాందోళన పడాల్సిన అవసరం లేదని, 85% మందికి ఇంట్లోనే నయమైపోతుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. అనవసరంగా రెమిడెసివిర్ వంటి మందులు, ఆక్సిజన్‌ను వినియోగించి కొరతకు కారణం కావొద్దని సూచించారు. బుధవారం ఆయన నారాయణ హెల్త్ చైర్మన్ డాక్టర్ దేవిశెట్టి, మేదాంత చైర్మన్ నరేశ్ ట్రెహాన్‌తో కలిసి ఓ వీడియో చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులేరియా పలు అంశాలను వివరించారు. ఆయా అంశాలు రణ్‌దీప్ గులేరియా మాటల్లోనే.. ‘‘కోవిడ్ మహమ్మారి ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు తగినంత డేటా ఉంది. కోవిడ్ బాధితుల్లో 85 శాతం మంది ఎలాంటి ప్రత్యేక చికిత్స.. అంటే రెమిడెసివిర్ లేదా స్టెరాయిడ్స్, ఇతర డ్రగ్స్ లేకుండానే కోలుకున్నారు. సాధారణ జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటాయి. వాటిని బట్టి సాధారణ చికిత్స తీసుకుంటే.. ఐదు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారు. అనవసరంగా ఆస్పత్రులకు పరుగెత్తడం ద్వారా.. బెడ్ అవసరమైన మరొకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది. మరో 15 శాతం మందికి వ్యాధి తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. అంటే ఆక్సిజన్ సాచురేషన్ స్థాయి తగ్గడం, హైగ్రేడ్ ఫీవర్ వంటివి రావొచ్చు. మరీ తీవ్రత పెరిగితేనే రెమిడెసివిర్, స్టెరాయిడ్స్, యాంటీ కాగ్నెంట్స్ అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో కన్వల్జెంట్ ప్లాస్మా ఇవ్వొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అనవసరంగా భయాందోళనకు గురవ్వొద్దు. రెమిడెసివిర్ వంటివి అతికొద్ది మందికి మాత్రమే అవసరం పడుతుంది. అసలు రెమిడెసివిర్ ప్రాణాలు కాపాడినట్టు, ప్రాణ నష్టం తగ్గించినట్టుగా డేటా ఏమీ లేదు. దీనిని ఒక మ్యాజిక్ బుల్లెట్‌గా పరిగణనలోకి తీసుకోవద్దు.
అనవసరంగా ఆక్సిజన్ వాడొద్దు
ఊపిరితిత్తులకు సంబంధించి న్యుమోనియా, క్రానిక్ లంగ్ డిసీజ్ ఉన్నప్పుడు, ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు మాత్రమే ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్వల్ప సమయం, కొన్నిసార్లు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. కానీ అనవసరంగా ఆక్సిజన్ తీసుకోవడం వృథా. ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉండి కూడా.. ఓ అరగంటో, గంటపాటో ఆక్సిజన్ తీసుకుంటే ఇంకా బాగుంటామని భావించడం సరికాదు. అది ఆరోగ్యానికి సాయపడుతుందనే డేటా ఏదీ ఇప్పటివరకు లేదు. చాలా మంది పేషెంట్లు ఇండ్లలో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని.. రోజూ అరగంట, గంట, రెండు గంటలపాటు తీసుకుంటున్నారు. అలా చేస్తే వాస్తవంగా అవసరమైన వారికి ఆక్సిజన్ అందుబాటులో లేకుండా చేసిన వారవుతారు.
సాచురేషన్ స్థాయిలో గమనించాల్సిందేంటి?
రక్తంలో ఆక్సిజన్ సరఫరా అయ్యే లెవల్స్‌ను ఆక్సిజన్ సాచురేషన్ అంటాం. ఇది కచ్చితంగా 98, 99 శాతం ఉండాల్సిన పనిలేదు. 92 నుంచి 98 మధ్య స్థిరంగా ఉన్నా ఫర్వాలేదు. సాచురేషన్ 95పైన ఉంటే ఆక్సిజన్ అవసరం లేదు. 94 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాస్త పరిశీలన పెట్టాలి. ఆరోగ్యవంతుల్లో అప్పటికీ ఆక్సిజన్ అవసరం రాకపోవచ్చు. గుండె, ఊపిరితిత్తుల జబ్బులున్న వారికి మాత్రమే ఆక్సిజన్ అవసరం రావొచ్చు. 90-92 మధ్య ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేతప్ప ఆక్సిజన్ సాచురేషన్ 97- 98 శాతం ఉండాలన్న కంగారు పనికిరాదు. ఆక్సిజన్ అయినా, రెమిడెసివిర్ అయినా అవసరం ఉన్నవారికి అందేలా అందరూ సహకరించాలి.
వాక్సిన్ వేయించుకున్నా కోవిడ్ వస్తుంది
వాక్సిన్ వేసుకున్నాక కూడా కోవిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాక్సినేషన్ అనారోగ్యం నుంచి కాపాడుతుందే తప్ప ఇన్‌ఫెక్షన్ నుంచి కాదు. అంటే.. వాక్సినేషన్ చేయించుకున్న తర్వాత కూడా కోవిడ్ సోకవచ్చు. మన ద్వారా ఇంకొకరికి వ్యాపించవచ్చు. కానీ మనం తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా రక్షణ ఉంటుంది. వాక్సిన్‌తో శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయి రక్షణ లభిస్తుంది. అందువల్ల వాక్సిన్ తీసుకున్నా కూడా.. కరోనా మీకు సోకకుండా, మీ నుంచి మరొకరికి వ్యాపించకుండా మాస్క్, భౌతిక దూరం వంటివి తప్పనిసరిగా పాటించాలి. మున్ముందు అసలు కోవిడ్ సోకకుండా ఉండే వాక్సిన్ రావొచ్చు.
జాగ్రత్తపడటమే మేలు
వైరస్ వ్యాప్తి చైన్‌ను తెంపడం ద్వారా విస్తృతిని తగ్గించవచ్చు. మాస్క్‌ను సరైన రీతిలో ధరించడం, భౌతిక దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటివి చేయాలి. వెంటిలేషన్ సరిగ్గా ఉన్న గదుల్లో ఉండాలి. సమూహాలకు దూరంగా ఉండాలి. స్నేహితులు, బంధువులే కదా. ఏమీ కాదనుకోవద్దు. లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ వ్యక్తులు మనచుట్టూ ఉండొచ్చు. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’
కరోనాపై అనవసర భయమొద్దు
Published Sat, Apr 24 2021 2:46 AM | Last Updated on Sat, Apr 24 2021 4:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment