తేజ్‌పూర్ (అసోం): ఈశాన్య భారత దేశం వణికి పోతుంది. వరుసగా వస్తున్న భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2:23 గంటలకు అసోంలో భూకంపం వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. అసోంలోని తేజ్‌పూర్ నగరానికి 40 కిలోమీరట్ల దూరంలో భూమి కంపించింది. భూ ఉపరితలానికి 14 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉందని తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదయ్యింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో
అంతకు ముందు మే 21 అసోం పొరుగు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఛాంగ్‌లాంగ్ సమీపంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 5.8గా నమోదు అయ్యింది. ఆ మరుసటి రోజే అరుచల్‌ప్రదేశ్‌కి సమీపంలో చైనాలోని ఉన్నావ్ ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదు అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా భారీగా ఆస్థి నష్టం సంభవించింది. ఈశాన్య భారతంలో ఉన్న పర్వత శ్రేణుల్లో ఒకే నెలలో మూడు సార్లు భూకంపం రావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే నెలలో ఉత్తరం వైపున లద్ధాఖ్‌లోనూ భూకంపం వచ్చింది.
ప్రకృతి విపత్తులు
మే నెలలో దేశంలో మూడు ప్రాంతాల్లో భూకంపం వచ్చినా ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. ఈ మూడు భూకంపాల తీవ్రత రిక్టరు స్కేలుపై 6 కు మించకపోవడంతో పెద్దగా ఆస్తినష్టం కూడా జరగలేదు. కానీ ఇదే నెలలో అరేబియా, బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు తీవ్ర తుపానులుగా మారాయి. టౌటే, యాస్ తుపానులు పశ్చిమ, తూర్పు తీర ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి. ఈ రెండు తుపానుల ధాటికి ఇటు మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కేరళ, కర్నాటకలు అటూ ఒడిషా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment