ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు తేలిపోనుంది. రెండు రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానా ల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. సాక్షి.కామ్ ఈ ప్రజా తీర్పును.. ఎప్పటికప్పటి ఫలితాలను మీకు ప్రత్యేకంగా అందించబోతోంది.
నాందేడ్ లోక్‌సభ స్థానంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌లో లోక్‌సభ స్థానానికి సైతం ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ పడిన రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా భవితవ్యం మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌తోపాటు ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు, నాందేడ్, వయనాడ్ లోక్‌సభ స్థానాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
మహారాష్ట్రలో మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే.
జార్ఖండ్‌లో 1,211 మంది పోటీ
మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసారి 1,211 మంది పోటీ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య అసలైన పోటీ నెలకొంది. జార్ఖండ్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, విజయం తమదేనని ఎన్డీయే నేతలు తేల్చిచెబుతున్నారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేవైపే మొగ్గుచూపాయి.
మహారాష్ట్రలో ఎంవీఏ ముందు జాగ్రత్త
మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి కనీసం 160 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment