ముంబై/రాంచీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 288 స్థానాల్లో బుధవారం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సాయంత్రం 5 గంటలకల్లా 60 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలీ చిల్లాలో 69.63 శాతం, ముంబైలో 51.41 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,100 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ నాగపూర్‌లో ఓటు వేశారు.
శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన మేనల్లుడికి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడికి ఓటు వేయడం విశేషం. మాహిమ్‌లో రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్నారు. బాంద్రా ఈస్ట్ స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీకి దిగారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బుధవారం ఉప ఎన్నికలు నిర్వహించారు.
స్వతంత్ర అభ్యర్థి మృతి
మహారాష్ట్ర ఎన్నికల్లో బీడ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే(43) బుధవారం మృతిచెందారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగానే ఆయన ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం సృష్టించింది. బీడ్ పట్టణంలోని ఛత్రపతి సాహూ విద్యాలయ పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
జార్ఖండ్ రెండో విడతలో 67.59 శాతం ఓటింగ్
జార్ఖండ్‌లో రెండో/చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండో విడతలో భాగంగా బుధవారం 38 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలవరకు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం 12 జిల్లాల్లో 14,218 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల్‌కు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించారు. మిగిలిన కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ కొనసాగింది.
సమయం ముగిసినప్పటికీ వరుసులో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. జాంతారా జిల్లాలో అత్యధికంగా 76.16 శాతం ఓటింగ్ నమోదైంది. బొకారో జిల్లాలో అతి తక్కువగా 60.97 శాతం ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య వేడుకలో ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని చెప్పారు. జార్ఖండ్‌లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment