కేవాడియా: భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు కుట్రలు పన్నుతున్నారని, అలాంటి కుయుక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విచ్ఛిన్నకర శక్తులను ఎదిరించాలని అన్నారు. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్‌లోని కేవాడియాలో ఐక్యతా ప్రతిమ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ కార్యక్రమంలో ప్రసంగించారు.
‘‘మోర్బీ వంతెన దుర్ఘటనలో మృతిచెందిన వారి పట్ల నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది. అయినా విధి, బాధ్యత నన్నిక్కడి తీసుకొచ్చాయి’’ అన్నారు. ఐక్యతా ప్రతిమ వద్ద సాంస్కృతిక నృత్యాలను ప్రమాదం దృష్ట్యా రద్దు చేశారు. ‘‘పటేల్ లాంటి నాయకుడు లేకపోతే ఇండియా పరిస్థితి ఏమిటో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఐక్యత అనేది మనకు నిర్బంధం, బలవంతం కాదు. అదే మన విశిష్టత. గతంలో వెదజల్లిన విషం తాలూకూ దుష్పరిణామాలు ఇప్పుడూ కనిపిస్తున్నాయి. విదేశీ శక్తులు మనకు చేటు చేసేందుకు చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాయి. వారికి గుణపాఠం చెబుదాం’’ అన్నారు.
పటేల్ ప్రధాని అయ్యుంటే...
జయంతి వేడుకలో అమిత్ షా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: సర్దార్ పటేల్ భారత తొలి ప్రధాని అయితే ప్రస్తుతం దేశానికి కొన్ని సమస్యలుండేవి కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సర్దార్‌పటేల్ పాఠశాల విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు.
‘‘లక్షద్వీప్, జోధ్‌పూర్, జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్ వంటి కీలక సంస్థానాలను పటేలే దేశంలో విలీనం చేశారు. కాంగ్రెస్ వర్కింట్ కమిటీలో అత్యధిక ఓట్లు సాధించినా ప్రధాని పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు దేశాన్ని కొన్ని అంశాలు వేధిస్తున్నాయి’’ అని అన్నారు.
సర్దార్
పటేల్‌కు
మోదీ సెల్యూట్
Comments
Please login to add a commentAdd a comment