విద్యుత్తు వాహనాలతో లాభాలు బోలెడు! ప్రయాణం ఖర్చు తక్కువ.. కాలుష్యం ఉండదు.. అయినా సరే.. రోడ్లపై ‘ఈవీ’లు ఎక్కువగా కనిపించవు. ఎందుకు? ఎక్కువ దూరం వెళ్లలేకపోవడం ఒక కారణమైతే.. బ్యాటరీ రీచార్జ్‌కు గంటల సమయం పట్టడం ఇంకొకటి. మొదటి సమస్య మాటెలా ఉన్నా.. రెండో దాన్ని బెంగళూరు స్టార్టప్ ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ పరిష్కరించింది. మరికొన్ని నెలల్లోనే ఈ కంపెనీ అభివృద్ధి చేసిన బ్యాటరీ ప్యాక్, స్మార్ట్ చార్జర్లు దశల వారీగా దేశం మొత్తమ్మీద ఏర్పాటు కానున్నాయి! 15 నిమిషాల్లోనే బ్యాటరీని నింపేస్తామంటోంది ఆ కంపెనీ! అదెలాగో చూసేయండి మరి!
సాక్షి, హైదరాబాద్: 2030 నాటికి దేశంలో అమ్ముడుపోయే కొత్త వాహనాల్లో 30 శాతం విద్యుత్తుతో నడిచేవి ఉండేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే చాలా కంపెనీలు విద్యుత్తు వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. అయితే వీటన్నింటితో ఉన్న ప్రధాన సమస్య చార్జింగ్ సమయం. ఉదాహరణకు ఓ ప్రముఖ కంపెనీ ఈవీలో 30.2 కిలోవాట్ల బ్యాటరీలు ఉన్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని ఆ కంపెనీ చెబుతోంది. స్పీడ్ చార్జింగ్ ద్వారా 80 శాతం బ్యాటరీ నింపేందుకు గంట సమయం.. ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటే పూర్తిగా నిండేందుకు పది గంటల వరకు సమయం పడుతుందని అంచనా.
అంటే ఈ రకమైన విద్యుత్ వాహనాలు తక్కువ దూరం మాత్రమే ప్రయాణించేందుకు పనికొస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి దూరాభారం వెళ్లాలంటే అసాధ్యమే. సాధారణంగా విద్యుత్తు వాహనాల బ్యాటరీలు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 4 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఒక్కో బ్యాటరీని వెయ్యి నుంచి 2 వేల సార్లు చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బ్యాటరీలు మార్చుకోవాలి. వేగంగా చార్జ్ చేయాలంటే లిథియం టైటనేట్ ఆక్సైడ్ (ఎల్‌టీవో) లేదా సూపర్ కెపాసిటర్లను వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరీదైన వ్యవహారాలు. పైగా చార్జింగ్ వేగం ఎక్కువైతే.. బ్యాటరీల సామర్థ్యం కూడా అంతే వేగంగా తగ్గిపోతుంది.
కాఫీ తాగొచ్చేలోపు..
ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ అభివృద్ధి చేసిన బ్యాటరీతో ఈవీని తయారు చేశారని అనుకుందాం. ‘ఈ–పంప్’తో ఇంటి దగ్గర 15 నిమిషాల్లో చార్జ్ చేసుకుంటే.. 312 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్‌లో బ్యాటరీని చార్జ్ చేసేందుకు ఉంచి.. ఓ కాఫీ తాగొస్తే సరి.. మళ్లీ 312 కి.మీలు వెళ్లేందుకు కారు సిద్ధంగా ఉంటుంది. ఈ–ప్యాక్‌ను ఏకంగా 3 వేల సార్లు చార్జింగ్, డిస్ చార్జింగ్ చేసినా దాని సామర్థ్యంలో వచ్చే నష్టం తక్కువగానే ఉంటుందని అరుణ్ వినాయక్ తెలిపారు.
అనుమతులు పొందిన తర్వాత ఈ ఏడాది చివరికల్లా బెంగళూరు, ఢిల్లీలో వీటిని మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కాగా, ఈ–ప్యాక్, ఈ–పంప్‌లను నడిపించేందుకు ప్రత్యేకమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్ వ్యవస్థను కూడా వీరు సిద్ధం చేశారు. బ్యాటరీ ప్యాక్‌లోని ఒక్కో సెల్‌లో విద్యుత్తు మోతాదు ఎంత ఉందన్నది గమనించి అందుకు తగ్గట్టుగా ఈ–పంప్ ద్వారా జరిగే విద్యుత్తు ప్రవాహాన్ని ఈ మేనేజ్‌మెంట్ వ్యవస్థ నియంత్రిస్తుంది.
ఎక్స్‌పొనెంట్ ప్రత్యేకతలు..
అరుణ్ వినాయక్, సంజయ్ బైలా కలసి బెంగళూరు కేంద్రంగా ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. విద్యుత్తు వాహనాల బ్యాటరీలను 15 నిమిషాల్లోనే చార్జ్ చేసేందుకు ప్రత్యేకమైన చార్జర్ ‘ఈ–పంప్’ను, అవసరానికి తగ్గట్టు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయేందుకు అవకాశం కల్పించే బ్యాటరీ ప్యాకేజీ ‘ఈ–ప్యాక్’ను ఈ కంపెనీ అభివృద్ధి చేసింది.
ఈ రెండింటినీ కలిపి వాడితే 15 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్‌గా చార్జ్ చేయడం సాధ్యమవుతుందని కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అరుణ్ వినాయక్ ‘సాక్షి’తో చెప్పారు. బ్యాటరీ పరిస్థితిని బట్టి చార్జర్ విద్యుత్తు ప్రసారాన్ని నియంత్రిస్తూ ఉంటుందని, ఫలితంగా బ్యాటరీకి జరిగే నష్టాలను నివారిస్తూనే తక్కువ సమయంలో ఎక్కువ విద్యుత్‌ను నింపేందుకు అవకాశం ఏర్పడిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment