
ఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెల రోజులకు పైగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ డిమాండ్లను ఇప్పటికైనా ప్రభుత్వం అంగీకరించకపోతే జనవరి26 గణతంత్ర వేడుకల్లో దేశ రాజధాని నగరంలో ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తాని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో కిసాన్ పరేడ్ పేరుతో రైతులు తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. ఇప్పటికే నూతన వ్యవసాయ చట్టాల రద్దు సహా నాలుగు ప్రధాన డిమాండ్లపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో కొంత పురోగతి చోటు చేసుకుంది. (టాయిలెట్ గదిలో రైతు ఆత్మహత్య )
రైతుల ప్రధానమైన 4 డిమాండ్లలో.. సాగు చట్టాల రద్దుకు విధివిధానాలు రూపొందించడం, కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించడమనే రెండు డిమాండ్ల అమలుపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. రైతులపై విద్యుత్ బిల్లుల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌కు, అలాగే, పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించే ప్రతిపాదనను విరమించుకోవాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరు వర్గాల మధ్య ఆరో విడత చర్చలు 50% అంశాలపై రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా, రైతు సంఘాల నేతలు వీటిని ఖండించారు.
ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి లిఖితపూర్వక సయోధ్య కుదరలేదని రైతు సంఘాల అధినేత స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపాడు. జనవరి4న మరోసారి చర్చలు నిర్వహిస్తామని, ప్రతిష్టంభన నెలకొన్న మిగతా రెండు డిమాండ్లపై కేంద్రం నుంచి సానుకూలత రాకపోతే గణతంత్ర వేడుకల్లో మార్చ్‌తో నిరసన తెలియజేస్తామని వెల్లడించాడు. చలి తీవ్రత ఉన్నా ఏమాత్రం లెక్కచేయకుండా దేశ వ్యాప్తంగా వేలాది మంది రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 50 మంది రైతులు అమరులయిన సంగతి తెలిసిందే. (రైతు సంఘాలతో చర్చల్లో పురోగతి)
Comments
Please login to add a commentAdd a comment