శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కశ్మీరీ ప్రజలు భారత్‌లో ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణింపబడుతున్నందున, చైనా పాలనే నయం అనుకునే అవకాశం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దును కశ్మీరీలు ఎన్నడూ స్వాగతించలేదని, బానిసల్లా బతికేందుకు ఇష్టపడరని పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తే ఒక్కసారిగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తారని చెప్పుకొచ్చారు. ‘ది వైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: చైనాతో చర్చిస్తున్నపుడు పాక్‌తో కూడా మాట్లాడండి..)
కాగా గతేడాది ఆగష్టు 5న జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఎన్డీయే సర్కారు ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అక్కడ భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అదే విధంగా జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తి, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలకు గృహ నిర్బంధం విధించారు. ఈ విషయాల గురించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కశ్మీరీ ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమను తాము భారతీయులమని భావించే స్థితిలో కూడా లేరని వ్యాఖ్యానించారు.
అంతేగాక ఆర్టికల్ 370 రద్దుకు ముందు లోయలో చోటుచేసుకున్న పరిణామాలు, బలగాల మోహరింపు గురించి తాను కేంద్రాన్ని ప్రశ్నించానని, భద్రతా కారణాల దృష్ట్యానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాధానం లభించిందన్నారు. కానీ మూడు రోజుల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370,35ఏను ఎత్తివేస్తారని అస్సలు ఊహించలేదని ఫరూక్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. కాగా జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలు నెలకొనాలంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఇటీవల ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment